సమస్యల తహసీల్‌! | - | Sakshi
Sakshi News home page

సమస్యల తహసీల్‌!

Jul 29 2026 9:51 AM | Updated on Jul 29 2026 9:51 AM

యాచారం: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వివాదాలకు అడ్డాగా మారింది. సమస్యలపై స్పందించని ఇక్కడి అధికారులు, సిబ్బంది సెటిల్మెంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు ఏళ్ల తరబడి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా స్పందించే వారే కరువయ్యారు. అదే రియల్‌ వ్యాపారులు వస్తే కూర్చోబెట్టి, మర్యాదలు చేసి క్షణాల్లోనే పనులు చక్కబెట్టి పంపిస్తున్నారని తెలుస్తోంది.

ధర్నాలు చేసినా..

తహసీల్దార్‌ కార్యాలయ పరిధిలోని 24 జీపీల్లో దాదాపు రెండు వేలకు పైగా వివిధ రకాల భూ సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం మీ సేవ కేంద్రాల్లో రూ.వేలాది డబ్బులు చెల్లించి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండాపోతోందని బాధితులు పేర్కొంటున్నారు. విసిగిపోయిన కొంతమంది రైతులు ధర్నాలు, నిరసనలు చేసినా స్థానిక సిబ్బంది లైట్‌ తీసుకుంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్‌కు రెవెన్యూ సమస్యలపై పెద్దగా అవగాహన లేదని, డిప్యూటీ తహసీల్దార్‌ కేవలం మోతుబరులు, రియల్‌ వ్యాపారుల పనులకే సమయం కేటాయిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రిజిస్ట్రేషన్లపైనే మక్కువ

రైతులు, సాధారణ ప్రజల సమస్యలను పట్టించుకోని సిబ్బంది రిజిస్ట్రేషన్లపైనే ఎక్కువ దృష్టిసారిస్తారని సమాచారం. ప్రతీ డాక్యుమెంట్‌పై రూ.5 వేలకు తగ్గకుండా వసూలు చేస్తారని, రిజిస్ట్రేషన్‌ సమయంలో ఏదైనా ఫిర్యాదు వచ్చిందంటే పెద్ద మొత్తంలో డిమాండ్‌ చేసి, పని కానిచ్చేస్తారని తెలుస్తోంది. ఆఫీసులో పనిచేసే ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ అన్నీ తానై నడిపిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం నందివనపర్తి– నస్దిక్‌సింగారం గ్రామాల మధ్య ఓ వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ విషయంలో రూ.లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఫ్యూచర్‌సిటీ నిర్మాణంతో కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నందివనపర్తి, చింతుల్ల, నస్దిక్‌సింగారం, చౌదర్‌పల్లి, యాచారం, గునుగల్‌, గడ్డమల్లయ్యగూడ, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో ఉన్నతాధికారులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు వందలాది ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో చిన్న తప్పులు ఉన్నాయని భయపెట్టి రూ. లక్షల్లో వసూల్‌ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి.

తహసీల్దార్‌పై వరుస ఫిర్యాదులు

● యాచారం తహసీల్దార్‌ అయ్యప్పపై కలెక్టర్‌ నారాయణరెడ్డితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు, ఇతర ఉన్నతాధికారులకు వరుస ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఓ మహిళా రైతు భూ సమస్య పరిష్కారం విషయంలో తహసీల్దార్‌ స్పందించడం లేదని రైతు కమిషన్‌ చైర్మన్‌ ముదిరెడ్డి కోదండరెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

● తక్కళ్లపల్లి, కొత్తపల్లి భూ సమస్యలపై రైతుల ఫిర్యాదుల మేరకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కలెక్టర్‌ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. మొండిగౌరెల్లి భూసేకరణ విషయంలో ప్రజాప్రతినిధులు, నాయకుల పట్ల తహసీల్దార్‌ అయ్యప్ప అమర్యాదగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రీసర్వే కోసం వస్తే తహసీల్దార్‌ సరిగ్గా స్పందించలేదంటూ సర్పంచ్‌ కోలన్‌ రమాదేవి రైతులతో కలిసి, కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

● తహసీల్దార్‌పై ఎమ్మెల్యే నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో మిగిలిన వారిలో భయం మొదలైంది. తమ భాగోతం ఎక్కడ వెలుగులోకి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కొందరైతే విధులకు వచ్చి వెంటనే వెళ్లిపోయారు.

పదేళ్లుగా తిరుగుతున్నా..

భూ సమస్యపై పదేళ్లుగా తహసీల్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. మొగుళ్లవంపు రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్‌ 98లో నాకుటుంబ సభ్యులకు చెందిన మూడెకరాలకు పైగా వ్యవసాయ భూమి పట్టా అమలుపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇటీవల కాడెడ్లు, అరకతో ధర్నా చేశా. అయినా వీరిలో చలనం లేదు.

– పాండురంగారెడ్డి, రైతు

చావే శరణ్యం

యాచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 386లో నా మూడెకరాల పట్టా భూమిని రికార్డుల్లో భూదాన్‌ పట్టాగా నమోదు చేశారు. సమస్యను పరిష్కరించమని ఐదేళ్లుగా తిరుగుతున్నా. ఆడపిల్లల వివాహాలు చేయాలి. పెళ్లి చేసిన బిడ్డకు కట్నం కింద భూమి రాసిస్తానని మాటిచ్చాం. సమస్య తీరకపోతే చావేశరణ్యం.

– పాల పెద్దమ్మ, యాచారం

సత్వరమే పరిష్కరిస్తాం

యాచారం తహసీల్దార్‌ అయ్యప్పపై ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఎందుకు ఫిర్యాదు చేశారో తెలుసుకుంటా. భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేలా కృషిచేస్తా. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి మా పరిధిలోని రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. మొండిగౌరెల్లి భూసేకరణ విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం.

– శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం

రెండు వేలకుపైగా దరఖాస్తుల పెండింగ్‌

వివాదాలకు అడ్డాగా యాచారం రెవెన్యూ కార్యాలయం

తహసీల్దార్‌ పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు

అధికార పార్టీకి నేతల ఫిర్యాదులు

ప్రజలు, రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement