ఆమనగల్లు: బంధువుల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తప్పిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలపూర్ మండల పరిధిలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన మల్కేడి నితీష్ కుటుంబ సభ్యులతో కలిసి గత శుక్రవారం గట్టుప్పలపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. రాత్రి గ్రామంలో బస చేసిన నితీష్ మరుసటిరోజు ఉదయం లేచి చూసేసరికి కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో నితీసోదరుడు సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తలకొండపల్లి సీఐ జానకిరాంరెడ్డి తెలిపారు. కాగా నితీష్‌కు కొద్ది రోజులుగా మతిస్థిమితం సరిగా ఉండడం లేదని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసినట్లు సీఐ చెప్పారు.
అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు
● పోలీసులను ఆశ్రయించిన గృహిణి
● ఏడుగురిపై కేసు నమోదు
చేవెళ్ల: అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారంటూ ఓ గృహిణి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని కందవాడ వార్డుకు చెందిన గౌండ్ల సుష్మితకు 2022 డిసెంబర్ 8న షాబాద్ మండలం హైతాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌తో వివాహమైంది. వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు 20 తులాల బంగారం, రూ.3లక్షల నగదు, రూ.లక్ష విలువైన సామగ్రిని కట్నంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం సజావుగా సాగిన వీరి సంసారంలో అదనపు కట్నం వేధింపులు మొదల య్యాయి. ఈ క్రమంలో భర్త శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు అత్తమామలు దశరథ్‌గౌడ్, నర్సమ్మ, ఆడపడుచులు సురేఖ, రమాదేవి, ఉమాదేవి, భావ శంకర్ అదనపు కట్నంకోసం వేధింపులకు పాల్పడుతున్నారని సుష్మిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తింటి వారు తనను మానసికంగా, శారీరకంగా హింసించడంతోపాటు తరచూ పుట్టింటికి పంపించేవారని తెలిపింది. రెండో కుమార్తె పుట్టిన తరువాత వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొంది. ఈనెల 10న అత్తగారి ఇంట్లో ఇద్దరు కుమార్తెలతో బంధించారని, విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో భరోసా కేంద్రం సహకారంతో పుట్టింటికి తీసుకువచ్చినట్లు చెప్పింది. కుటుంబ పెద్దల సమక్షంలో, పోలీసుల కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా పలుమార్లు రాజీ ప్రయాత్నాలు చేసినప్పటీకి వారిలో మార్పురాలేదని, దీంతో తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినట్లు వివరించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్తతోపాటు ఏడుగురిపై వరకట్నం వేధింపులు, గృహహింసకు సంబంధించిన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


