చీటింగ్‌ కేసులో 13 మందికి జైలు | - | Sakshi
Sakshi News home page

చీటింగ్‌ కేసులో 13 మందికి జైలు

Jul 29 2026 9:51 AM | Updated on Jul 29 2026 9:51 AM

రూ.2 వేల చొప్పున జరిమానా

సిద్దిపేట కమాన్‌: తప్పుడు వివరాలతో ఆటోలను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి యత్నించిన 13మంది నిందితులకు సిద్దిపేట కోర్టు ఒక్కొక్కరికి పది రోజుల జైలు శిక్షతో పాటు, రూ.2వేల జరిమానా విధించింది. టూటౌన్‌ సీఐ మురళి వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్లు కొమ్మరాజుల అశోక్‌, నార్సింగి సురేశ్‌, కేతావత్‌ రవికుమార్‌, ఏర్రోళ్ల వస్థల్‌ నాథ్‌కుమార్‌, గాదె మహేశ్‌, మహ్మద్‌ రఫీ, పాశం సుమన్‌, అరుపుల నర్సింగ్‌రావు, గండు దయానంద్‌, జిల్ల శంకర్‌, కటికెల మల్లేశ్‌, అంజమ్‌ సురేశ్‌, పుట్టి రవీందర్‌ డీజిల్‌ ప్యాసింజర్‌ ఆటోలను నడుపుతుంటారు. కాగా వీరు తమ ఆటోలను తమ పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించుకునే క్రమంలో హైదరాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయంలో డీజిల్‌ ప్యాసింజర్‌ ఆటోలు రిజిస్ట్రేషన్‌ కాలేదు. వీటిపై బ్యాన్‌ విధించడంతో సిద్దిపేట ఆర్టీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు అవుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట చిరునామాతో కూడిన తప్పుడు వివరాలతో ఆధారు కార్డులు సృష్టించి 2016 ఏప్రిల్‌లో అక్కడి ఆర్టీఓ కార్యాలయంలో ఆటోలను రిజిస్ట్రేషన్‌ చేయించుకునే ప్రయత్నం చేశారు. వారు సమర్పించిన ఆధారు కార్డులను ఆర్టీఓ సిబ్బంది పరిశీలించి తప్పు జరిగినట్లు గుర్తించారు. ఆర్టీఓ కార్యాలయం ఏఓ సదానందం పోలీసులకు ఫిర్యాదు చేయగా 13మంది ఆటో డ్రైవర్లపై చీటింగ్‌ కేసు నమోదైంది. కేసు విచారణ అనంతరం సిద్దిపేట కోర్టు పై నిందితులకు ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానాతో పాటు పది రోజుల జైలు శిక్ష విధించింది.

వెంచర్‌ పరిశీలన

యాచారం: కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న వెంచర్‌ను ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. వెంచర్‌ యజమానులు ప్రభుత్వ భూమిని అక్రమించారనే ఫిర్యాదుతో తహసీల్దార్‌ అయ్యప్ప, సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ మధు, రెవెన్యూ, సర్వేయర్‌ అధికారుల బృందంతో వెళ్లి, అనుమతి పత్రాలను పరిశీలించారు. తక్షణమే వెంచర్‌ పక్కన ఉన్న ప్రభుత్వ అసైన్డ్‌ భూములను సర్వే చేసి, హద్దులు పాతి ఫెన్సింగ్‌ వేయాలని సర్వే శాఖ అధికారులకు సూచించారు. వెంచర్‌ యజమానులు ప్రభుత్వ భూమిని అక్రమిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నకిలీ డీఏపీ విక్రేతపై కేసు

పూడూరు: నకిలీ డీఏపీ విక్రయించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన చన్గోముల్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్‌ అజీముద్దీన్‌ మంచన్‌పల్లి గ్రామానికి చెందిన రైతులు ఉమ్మెంతల రాఘవేందర్‌, తంగడపల్లి వీరేశంతో పాటు మరికొందరి రైతులకు 176 బస్తాల నకిలీ డీఏపీ విక్రయించాడు. కొందరు ఇళ్లలో నిల్వ చేసుకోగా మరి కొందరు పంటకు వేశారు. ఇది నకిలీదిగా గుర్తించిన రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. పూడూరు వ్యవసాయ అధికారి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రైతుల వద్ద నిల్వ ఉంచిన డీఏపీ బస్తాలను ఠాణాకు తరలించి నాణ్యత నిర్ధారణ కోసం నమూనాలను ల్యాబ్‌కు పంపించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement