కొత్తగా మరో ఠాణా! | - | Sakshi
Sakshi News home page

కొత్తగా మరో ఠాణా!

Jul 29 2026 9:51 AM | Updated on Jul 29 2026 9:51 AM

ప్రతిపాదనలు

మొయినాబాద్‌: నగరానికి అతి చేరువలో.. ఓఆర్‌ఆర్‌ పక్కనే ఉన్న మొయినాబాద్‌ ప్రాంతంలో కొత్త పోలీస్‌స్టేషన్‌ రాబోతున్నట్టు సమాచారం. ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలోని మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విభజించి.. కొత్తగా మరో ఠాణా ఏర్పాటుకు ఉన్నతాధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా.. అజీజ్‌నగర్‌, కనకమామిడి కేంద్రంగా ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

సంచలనాలకు కేంద్ర బిందువు

మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న ఈ స్టేషన్‌లో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన చాలా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖుల వ్యవసాయ క్షేత్రాలు, ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లు ఉన్నాయి. ప్రముఖుల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో నిత్యం బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఎస్‌హెచ్‌ఓగా ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి కొనసాగుతుండగా నలుగురు ఎస్‌ఐలతోపాటు 60 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వీరంతా ప్రధాన కేసుల విచారణ, బందోబస్తు, ఇతరత్రావాటికే అధిక సమయం కేటాయిస్తుండంతో కేసుల విచారణలో జాప్యం జరుగుతోంది.

పెరిగుతున్న కేసులు

పదేళ్లతో పోలిస్తే స్థానికంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిలో సంచలనం సృష్టించినవి కొన్నయితే దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, భూ తగాదాలు, డ్రగ్స్‌ కేసులు, సైబర్‌ నేరాలు, పోక్సో కేసులు చాలానే నమోదవుతున్నాయి. మరోవైపు ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లో నమోదవుతున్న కేసుల విచారణ నేరుగా కమిషనర్‌, డీసీపీ స్థాయి అధికారులే చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు అధికంగా ఉండటంతో ఇటీవలి కాలంలో హాస్టళ్లు విపరీతంగా ఏర్పాటయ్యాయి. వీటిలో వేలమంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. కళాశాలలు, హాస్టళ్లు ఉన్న ప్రాంతాల్లో డ్రగ్స్‌ కేసులు, ఇతర కేసులు నమోదవుతున్నాయి. వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

అధికారుల మధ్య చర్చ

మొయినాబాద్‌ ప్రాంతంలో కొత్త పోలీస్‌ష్టేషన్‌ ఏర్పాటుపై ప్రభుత్వం చర్చించినట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌ స్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం. వారి ఆదేశాలతోనే ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ తరుణ్‌ జోషి ఇటీవల మొయినాబాద్‌ ఠాణాను సందర్శించిన చేవెళ్ల డీసీపీ యోగేష్‌గౌతమ్‌, ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జునరెడ్డితో చర్చించినట్టు తెలుస్తోంది.

మొయినాబాద్‌ పరిధిలో ఏర్పాటు

ఇప్పటికే ఉన్న పోలీస్‌ స్టేషన్‌ విభజన

పెరుగుతున్న కేసుల నేపథ్యంలో నిర్ణయం

సన్నాహాలు మొదలుపెట్టిన ఉన్నతాధికారులు

పరిశీలనలో అజీజ్‌నగర్‌, కనకమామిడి

మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ను విభజించి కొత్తగా మరోటి అజీజ్‌నగర్‌, కనకమామిడి కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. మండలంలోని అమ్డాపూర్‌, కాశీంబౌలి, బాకారం, నాగిరెడ్డిగూడ గ్రామాలతోపాటు అజీజ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, ఎనికేపల్లి ప్రాంతాలను కలిపి అజీజ్‌నగర్‌ కేంద్రంగా, మండలంలోని మిగతా ప్రాంతాన్ని మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలుపుతూ ఒక ప్రతిపాదన చేస్తున్నట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీతోపాటు అమ్డాపూర్‌, కాశీంబౌలి, బాకారం, నాగిరెడ్డిగూడ, చందానగర్‌ పంచాయతీలను మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కొనసాగిస్తూ.. మండలంలోని శ్రీరాంనగర్‌, వెంకటాపూర్‌, కేతిరెడ్డిపల్లి, కనకమామిడి, నక్కలపల్లి, ఎత్‌బార్‌పల్లి, తోలుకట్ట, అప్పారెడ్డిగూడ, మేడిపల్లి, చిన్నమంగళారం, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, కుత్బుద్దీన్‌గూడ, ఎలుకగూడ పంచాయతీలు, చేవెళ్ల మండలం ముడిమ్యాల, రావులపల్లి గ్రామాలను కలిపి కనకమామిడి కేంద్రంగా కొత్త పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు మరో ప్రతిపాదన రూపొందిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement