రైతుల ఖాతాల్లో పరిహారం జమ | - | Sakshi
Sakshi News home page

రైతుల ఖాతాల్లో పరిహారం జమ

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

రైతుల ఖాతాల్లో పరిహారం జమ నేరాల నియంత్రణకే కార్డన్‌ సెర్చ్‌ ప్రభుత్వ భూములపై ఏడీ సర్వే తక్కువ వడ్డీకే పాడి రైతులకు రుణాలు

షాద్‌నగర్‌: రేడియల్‌ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అందజేసిన నష్ట పరిహారాన్ని శుక్రవారం షాద్‌నగర్‌ ఆర్డీఓ సరిత రైతుల ఖాతాల్లో జమ చేశారు. కొందుర్గు మండల పరిధిలోని చుక్కమేట్‌, జిల్లేడు చౌదరిగూడ మండలం తుమ్మలపల్లి గ్రామాల్లో సుమారు 40 ఎకరాల భూమిని రేడియల్‌ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రైతులకు రూ.10 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేసినట్లు ఆర్డీఓ తెలిపారు.

శంకర్‌పల్లి: నేరాల నియంత్రణ కోసమే తనిఖీలు చేపడుతున్నట్లు చేవెళ్ల ఏసీపీ కిషన్‌ అన్నారు. మోకిల ఠాణా పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్‌ ఫేజ్‌–2లో చేవెళ్ల ఏసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానితుల వేలిముద్రలు సేకరించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 52 బైక్‌లు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం తనిఖీలు చేపట్టామని, ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో సీఐ శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.

తుర్కయంజాల్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మునగనూర్‌లోని ప్రభుత్వ సర్వే నంబర్‌ 44తో పాటు ఇంజాపూర్‌లోని సర్వే నంబర్‌ 66లోని భూములపై శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఏడీ సమక్షంలో నిర్వహించిన ఈ సర్వే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తహసీల్దార్‌ సుదర్శన్‌ రెడ్డి పేర్కొన్నారు. భూముల కబ్జాలను సాక్షి వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. సర్వే కార్యక్రమంలో మండల సర్వేయర్‌ శ్రీనివాస్‌, బీపీఓ బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

షాద్‌నగర్‌: పాడి రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందజేయనున్నట్లు విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్‌ కవిత తెలిపారు. పట్టణంలోని విజయ డెయిరీ కార్యాలయంలో శుక్రవారం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాడి రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు యూనియన్‌ బ్యాంక్‌ సహకారంతో రుణాలు అందజేస్తున్నట్లు చెప్పారు. పశువుల కొనుగోలు, పాడి పరిశ్రమ అభివృద్ధికి రుణాలు ఎంతో ఉపయోగపడతాయని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పాల ధరను పెంచాలని పలువురు పాడి రైతులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విజయ డెయిరీ మేనేజర్‌ భారతలక్ష్మి, కొందుర్గు ఇన్‌చార్జి హరిబాబు, పాడి రైతుల సొసైటీల అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, వెంకట్‌, నర్సింహారెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement