హయత్‌నగర్: పాడి రైతులు, సంస్థ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా సంస్థను గాడిలో పెట్టేందుకే ఎన్‌డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు)తో ఒప్పందానికి సిద్ధమయ్యామని నార్ముల్ మదర్‌డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. పెండింగ్ పాల బిల్లుల చెల్లింపుకోసం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని మెజారిటీ సొసైటీల చైర్మన్‌లు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం ఆయన హయత్‌నగర్‌లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సొసైటీల చైర్మన్‌లు మాట్లాడుతూ.. ఐదున్నర నెలలుగా బిల్లులు చెల్లించలేదని అన్నారు. పాలక వర్గం రాజీనామ చేయాలని, చైర్మన్ స్పందించకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పాలకవర్గం, అధికారుల అక్రమ ఆస్తులపై దర్యాప్తు చేపట్టాలని, చైర్మన్‌ను రైతులే నేరుగా ఎన్నుకునే విధంగా బైలా మార్చాలని డిమాండ్ చేశారు. మిజా చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. చిట్యాల భూమి కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. బ్యాంకు రుణాల కోసమే లాభాలు చూపించామని తెలిపారు. పాలక వర్గం సభ్యులకు అవగాహన లేకపోవడం, అనుభవ లేమి కారణంగా సంస్థ నష్టాల్లోకి వెళ్లిందన్నారు. ఎన్‌డీడీబీతో ఒప్పందంతో సంస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. చైర్మన్ మధుసూదన్‌రెడ్డి సమాధానం ఇస్తూ గతంలో ఉన్న పాలక వర్గం నిర్వాకంతోనే సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని, ఎన్‌డీడీబితో ఒప్పందంలో ఎలాంటి దాపరికం లేదన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వెంటనే రూ.10 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చారని తెలిపారు. సంస్థ ప్రతినిధి మహిపాల్‌రెడ్డి ఎన్‌డీడీబి ఒప్పంద వివరాలను చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎండీ కాటెపల్లి లింగారెడ్డి, పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.
నార్ముల్ మదర్‌డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి


