హోరాహోరీ పోరు.. ఎవరిదో జోరు
● ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
● ఆమనగల్లులో త్రిముఖ పోరు
● వలస ఓటర్లపై గురి
ఆమనగల్లు: మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. మున్సిపాలిటీలో ప్రస్తుతం త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడున్న 15 వార్డుల్లోనూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ తలపడుతున్నాయి. మెజార్టీ కౌన్సిలర్‌లను గెలిపించుకుని చైర్మన్ కుర్చీ దక్కించుకుని తమ ఆదిపత్యం చాటుకోవాలని మూడు పార్టీలు పట్టుతో ఉన్నాయి. ఆమనగల్లు మున్సిపాలిటీని దక్కించుకునేందుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పట్టుదలగా ఉన్నారు. సిట్టింగ్ మున్సిపల్ పదవిని కాపాడుకునేందుకు కాషాయదళం ప్రయత్నిస్తోంది. ఈ దఫా మున్సిపల్ పీఠం తమదేనని బీఆర్‌ఎస్ చెబుతోంది. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియగా ఆయా పార్టీలు ప్రలభోలా పర్వానికి తెరలేపాయి. ఈ హోరాహోరీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
అభివృద్ధి మంత్రం
ఆమనగల్లు మున్సిపాలిటీ అబివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో పోరాడుతుంది. గత బీజేపీ పాలకవర్గం ఆమనగల్లు అభివృద్ధిని పట్టించుకోలేదని కేవలం కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ నేతలు ప్రచారం సాగించారు. అధికార కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆమనగల్లు అభివృద్దికి నోచుకుంటుందని ఓటర్లకు వివరించారు. తమను గెలిపిస్తే ఆమనగల్లులో అన్ని డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు అవుతాయని చెబుతున్నారు. దీనికితోడు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధికి ఎన్ని నిదులైన తీసుకువస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
మరోసారి పీఠం మాదే
ఆమనగల్లు మున్సిపాలిటీ ఏర్పాటు అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకుని చైర్మన్ పదవిని దక్కించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో బీజేపీ తమకు మరో అవకాశం ఇవ్వాలంటూ ప్రచారం చేపట్టింది. బీజేపీతోనే ఆమనగల్లు అభివృద్ధి జరుగుతుందని ఆ నేతలు వివరించారు. బీజేపీ జాతీయ నేత ఆచారి అన్ని తానై మున్సిపల్ పీఠం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి మున్సిపాలిటీని దక్కించుకుంటామని ధీమాతో ఉన్నారు.
బీఆర్‌ఎస్‌లో జోష్
ఆమనగల్లు మున్సిపాలిటీని దక్కించుకోవడానికి బీఆర్‌ఎస్ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసింది. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాపిశెట్టి రాము బీఆర్‌ఎస్‌లో చేరి కౌన్సిలర్‌గా పోటీ చేయడంతో బీఆర్‌ఎస్‌లో నయా జోష్ కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ప్రచారాన్ని హోరెత్తించింది.


