ఓట్ల బేరం!
● జోరందుకున్న ప్రలోభాల పర్వం
● పది రోజులుగా యథేచ్ఛగా
మద్యం సరఫరా
శంకర్‌పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అభ్యర్థులు సైతం తమను గెలిపిస్తే చేసే పనులు, హామీలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్నారు. బంగారం.. నగదు.. ఆర్థికసాయం అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి నిత్యం మద్యం, రెండు, మూడు రోజులుగా డబ్బుల పంపిణీ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు మాట్లాడుతున్నారని మున్సిపల్ వాసులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
అమలయ్యేనా!
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తమ అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే పలు వార్డుల్లో అభ్యర్థులు తమ మెనిఫెస్టోలను విడుదల చేసి, వార్డులో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, మరొకరు రూ.లక్ష నగదు ఇస్తామని, ఇంకొకరు పూర్తి ఖర్చు భరిస్తాం అని, సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు, యువజన సంఘాల భవనాలు, తాగునీరు, అంత్యక్రియలకు ఆర్థిక సాయం అంటూ విచ్చలవిడిగా హామీలు ఇస్తున్నారు. వీళ్లు ఇచ్చే హామీలు అసలు అమలవుతాయా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.
మొదటి దఫా పూర్తి
రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థుల సీట్ల కేటాయింపు నుంచే ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు తమ వార్డుల్లో ఇప్పటికే రూ.5వేలు, రూ.10వేలు, కొన్ని చోట్ల వెండి నాణేలు, చీరలు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. మలి దఫాలో మరింత డబ్బును వెదజల్లే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మూడు, నాలుగు రోజుల నుంచి నడుస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నిత్యం ఓటర్ల ఇంటికి మద్యం సరఫరా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నా పోలీసులు కంటితుడుపు చర్యగా కొన్ని బాటిళ్లను పట్టుకుని మిగిలినవి వదిలేస్తున్నారనే అపవాదు ఉంది.
సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
పలువురు అభ్యర్థులు తమ వార్డుల్లోని ఓటర్లకు ముందే భారీ మొత్తంలో డబ్బులను ముట్టజెప్పారు. ఆ సమయంలో వారి మత గ్రంథాలపై ప్రమాణం చేపించుకుని తమకే ఓటు వేయాలని మాట్లాడించుకున్నట్లు సమాచారం. మరికొన్ని వార్డుల్లోని నాయకులు తమ చతురతతో కంట నీరు పెడుతూ, ఓటర్లకు సెంటిమెంట్ డైలాగులతో, కాళ్ల మీద పడి ఈ ఒక్కసారి గెలిపించండి అంటూ వేడుకుంటున్నారు.
ఓట్ల బేరం!


