ప్రజావాణి అర్జీలను
నిర్లక్ష్యం చేయొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వారి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం రెవెన్యూ శాఖకు సంబంధించి 8, ఇతర శాఖలకు సంబంధించి 32 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీఆర్‌ఓ సంగీత పాల్గొన్నారు.
నాదర్‌గుల్ రైతుల ఆందోళన
బాలపూర్ మండలం నాదర్‌గుల్ సర్వే నంబర్ 197లో 250 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాగా మార్పిస్తామని సైదాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్, కౌండిన్య కుమార్ నకిలీ ఎన్‌ఓసీ సృష్టించి 200 మందిని మోసం చేశారని బాధిత రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
భవన నిర్మాణ కార్మికులకు అవగాహన
భవన నిర్మాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో పది రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 3వ తేదీ వరకు భవన నిర్మాణ కార్మికుల కోసం సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కార్మిక శాఖ, యూనియన్లు, కాంట్రాక్టర్లు, స్థానిక సంస్థలు సమష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్‌ఓ సంగీత, అసిస్టెంట్ లేబర్ అధికారి వినీల తదితరులు పాల్గొన్నారు.
నేడు వడ్డీలేని రుణాల పంపిణీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) ఇందిరా మహిళా శక్తి కింద వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 16,518 సంఘాలకు రూ.17.02 కోట్లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 11 గంటలకు రుణాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి


