కొందుర్గు: తమ పంట పొలాల మీదుగా రోడ్డు వేయొద్దంటూ మండలంలోని చుక్కమెట్టు, ముట్పూర్, ఉమ్మెంత్యాల గ్రామాల రైతులు సోమవారం నగరంలోని హెచ్‌ఎండీఏ కార్యా లయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగించే తమ భూములు తీసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. పచ్చని పంట పొలాల్లో రోడ్డు వేయడం ఏమిటని నిలదీశారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాలని, లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. కార్యక్రమంలో రైతులు యాదయ్య గౌడ్, రాజు, చెన్న కేశవులు, నర్సింహారెడ్డి, కిష్టారెడ్డి, మల్లేష్, రామయ్య, రాములు, నర్సింలు, శివ తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు: అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వం నుంచి చీరలు తప్పకుండా అందుతాయని డీఆర్‌డీఓ శ్రీలత స్పష్టం చేశారు. మండల పరిషత్ సమావేశ హాల్‌లో సోమవారం ఏపీఎం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల్లోని సభ్యులందరితో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతి యువతిని సంఘంలో చేర్పించి చీరలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీసీ సరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, వైస్ చైర్మన్ యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్, డీపీఎం యాదయ్య, సీసీలు, వీఓఏలు, మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
హుడాకాంప్లెక్స్: తిరుపతిలోని అఖిల భారత పద్మశాలి నిత్యాన్నదాన సత్రం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా సరూర్‌నగర్‌కు చెందిన రావిరాల సంధ్యారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం తిరుపతిలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ధర్మకర్తలను ఎన్నుకున్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం నేతల ఆధ్వర్యంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. తనకు అవకాశంకల్పించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో కొలువైన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని సోమవారం బిగ్‌బాస్ ఫేం, సినీ నటి దివి దర్శించుకున్నారు. శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఆమెకు జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మరకత శివాలయంలోని ప్రశాంతత, శివ నామస్మరణ తనకి ఎంతో నచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు, అర్చకుడు ప్రమోద్, సభ్యుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
పంట పొలాల మీదుగా రోడ్డు వేయొద్దు
పంట పొలాల మీదుగా రోడ్డు వేయొద్దు


