నిరసన గళం
గతంతో పోలిస్తే బీసీలకు తగ్గిన అవకాశాలు
ఆశించిన స్థాయిలో సీట్లు దక్కక పోవడంపై ఆగ్రహం
పలుచోట్ల నిరసన గళం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉత్కంఠకు తెర పడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా, డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంతో పోలిస్తే బీసీలకు భారీగా అవకాశాలు తగ్గాయి. కొన్ని పంచాయతీలు శివారు మున్సిపాలిటీల్లో కలిసిపోవడం, కొత్త మున్సిపాలిటీలు ఏర్పడడంతో సుమారు వంద బీసీ సర్పంచ్ స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. జిల్లాలో మొత్తం 526 పంచాయతీలు ఉండగా, ఎస్టీ జనరల్‌కు 49, ఎస్టీ మహిళలకు 42 స్థానాలు కేటాయించారు. 55 ఎస్సీ జనరల్‌కు, 51 ఎస్సీ మహిళలకు, బీసీ జనరల్‌కు 50, మహిళలకు 42 స్థానాలు కేటాయించారు. ఇక అన్ రిజర్వ్‌డ్ కేటగిరీలో మహిళలకు 112, పురుషులకు 125 స్థానాలు కేటాయించారు.
బీసీ స్థానాలపై పెదవి విరుపు
ఆమనగల్లు మండలంలో 13 జీపీలు ఉండగా వీటిలో ఎస్సీ, ఎస్టీలకు ఏడు స్థానాలు రిజర్వ్ కాగా మిగిలిన వాటిని జనరల్‌కు కేటాయించారు. ఇక్కడ బీసీలకు ఒక్క సీటు కూడా దక్కలేదు. కొత్తూరు, కడ్తాల్ మండలాల్లోనూ ఒకే స్థానంతో సరిపెట్టాల్సి వచ్చింది. ఆయా గ్రామాల్లో మెజార్టీ జనాభా బీసీలే ఉన్నప్పటికీ వారికి ఆశించిన స్థాయిలో సీట్లు దక్కక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల నిరసన వ్యక్తం చేశారు.
వార్డుల కేటాయింపు ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 4,668 వార్డులు ఉండగా వీటిలో వందశాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీల్లో 238 వార్డులు మహిళలకు కేటాయించారు. మరో 238 వార్డులను పురుషులు/ మహిళలకు కేటాయించారు. ఇక జనరల్ పంచాయతీల్లో ఎస్టీ మహిళలకు 106, పురుషులకు 153 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 378 వార్డులు కేటాయించగా, 522 స్థానాలు మహిళలు/ పురుషులకు కేటాయించారు. 379 స్థానాలు బీసీ మహిళలకు, మరో 549 బీసీ పురుషులు/మహిళలకు కేటాయించారు. అన్ రిజర్వ్‌డ్ కేటగిరీలోని మహిళలకు 983 స్థానాలు, పురుషులకు 1,122 స్థానాలు కేటాయించారు.


