రక్షణ కల్పించలేకపోతే ఆయుధాలివ్వండి
షాద్‌నగర్: పేదలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వానికి చేతకాకపోతే వారికి ఆయుధాలిచ్చి లైసెన్సులు జారీ చేయాలని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఫరూఖ్‌నగర్ పరిధిలోని ఎల్లంపల్లిలో ఇటీవల దారుణహత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కులాంతర వివాహానికి సహకరించాడని దళితుడైన రాజశేఖర్‌ను దారుణంగా హతమార్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. సమాజంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అందులో బహుజన వర్గాల వారే చితికిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వారికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హోంశాఖను తన వద్దే ఉంచుకొని పేదలను కాపాడలేకపోతున్నారని, బహుజనులను రక్షించడం చేతకాకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరువు హత్య జరిగినా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్డూరి లక్ష్మణ్ బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. రాజశేఖర్ హత్యకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, నిర్లక్ష్యంగా వ్యహరించి పోలీసులపై చర్యలు చేపట్టాలని అన్నారు. దిశ ఎన్‌కౌంటర్ తరహాలో నిందితులకు శిక్ష పడాలన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకోవాలని, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, నాయకులు కొందూటి నరేందర్, ఎంఎస్ నటరాజన్, లక్ష్మణ్ నాయక్, సత్యనారాయణ, పెంటనోళ్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
రాజశేఖర్ హత్యకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి
దిశ ఎన్‌కౌంటర్ తరహాలో నిందితులకు శిక్ష పడాలి
బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్


