కులవ్యవస్థను నిర్మూలించాలి
షాద్‌నగర్‌రూరల్: గ్రామాల్లో కులవ్యవస్థ నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఎల్లంపల్లిలో ఇటీవల పరువు హత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కులాంతర వివాహానికి సహకరించాడని దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్‌ను దారుణంగా హత్య చేయడం బాధాకరమని పేర్కొన్నారు. సమాజంలో కులవివక్ష హత్యలు అధికంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కులవివక్ష అనేది కరోనా కంటే ప్రమాదకరమైందన్నారు. కరోనాను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా ప్రచార చర్యలు చేపట్టాయో అదేవిధంగా కుల వ్యవస్థ నిర్మూలనకు పాటుపడాలని కోరారు. ఎర్ర రాజశేఖర్‌ను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు, రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ, నాయకులు జాంగారి రవి, దొడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ


