భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అన్ని విధాలా అండగా ఉంటామని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని అన్మాస్‌పల్లి, ఎక్వాయిపల్లి, మర్రిపల్లి, ఆకుతోటపల్లి గ్రామాల రైతులతో సోమవారం ఎక్వాయిపల్లిలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న పలువురు రైతులు తమ గోడు వెలిబుచ్చారు. తాతల కాలం నుంచి సేద్యం చేసుకుంటూ బతుకుతున్నామని, ప్రభుత్వం రోడ్డును నిర్మిస్తే ఎక్కడికి వెళ్లి బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా కోల్పోతున్న భూమికి భూమి పరిహారంగా ఇవ్వాలని, లేని పక్షంలో కొంగరకలాన్, రావిర్యాలలో ఇచ్చినట్లు పరిహారం ఇవ్వాలని కోరారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ప్రారంభమయ్యే రావిర్యాల నుంచి ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి వరకు ఒకే విధమైన పరిహారం చెల్లించాలన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి సమస్యను వివరిస్తామని, న్యాయమైన పరిహారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయశ్రీ, ఎంపీడీఓ సుజాత, మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికాంత్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్ పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి


