మైనింగ్‌ మాఫియా! | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ మాఫియా!

Nov 24 2025 8:39 AM | Updated on Nov 24 2025 8:39 AM

మైనిం

మైనింగ్‌ మాఫియా!

మంగళ్‌పల్లిలో..

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొంత మంది తవ్వకాలు చేపడుతుంటే.. మరికొంత మంది తాత్కాలిక అనుమతుల పేరుతో అనుమతులకు భిన్నంగా తవ్వకాలు చేపడుతున్నారు. కళ్లముందే ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ, మున్సిపల్‌, మైనింగ్‌, పోలీసు యంత్రాంగాలు కళ్లప్పగించి చూస్తున్నాయే కానీ.. అక్రమ మైనింగ్‌ను మాత్రం అడ్డుకోవడం లేదు. గనుల లీజు, అనుమతి ఫీజులు, రాయల్టీల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో భారీగా గండిపడుతోంది. మైనింగ్‌ తవ్వకాలపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లా మైనింగ్‌ విభాగం అధికారులు ఇటీవల ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, వనస్థలిపురం, పహడీషరీఫ్‌, ఆదిబట్ల తహసీల్దార్లతో పాటు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడం గమనార్హం. అడ్డుకోవాల్సిన పోలీసులు ఒక్కో లారీ యజమాని నుంచి రోజుకు రూ.30 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇచ్చేందుకు నిరాకరించిన వాళ్ల లారీలను సీజ్‌ చేసి, కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.

కోహెడను కొల్లగొట్టిన గనులు

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడ సర్వే నంబర్‌ 167/2 ఓ ప్రముఖ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొంది పెద్ద మొత్తంలో విల్లాలు కడుతోంది. సహజసిద్ధంగా ఏర్పడిన కొండలు, గుట్టలను చదును చేస్తోంది. అనుమతులు లేకుండా తవ్వకాలు, జిలిటెన్‌స్టిక్స్‌తో బ్లాస్టింగ్‌ పనులు చేపట్టి తవ్వకాల ద్వారా వచ్చిన మట్టి, కంకరను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తోంది. మైనింగ్‌శాఖకు రాయల్టీ చెల్లించడం లేదు. పేలుళ్ల దాటికి పక్కనే ఉన్న బోరు బావులు దెబ్బతినడంతో పాటు విపరీతమైన శబ్దకాలుష్యం వెలువడుతోంది. క్రషర్‌ మిషన్‌ నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇటీవల మైనింగ్‌ శాఖ ఏడీ నర్సిరెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం విశేషం. సదరు స్టేషన్‌ పోలీసులు చిన్నాచితక లారీలను సీజ్‌ చేసి, పెద్దలను వదిలేస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులకు మట్టి, కంకర, డస్ట్‌, ఇసుకను తరలిస్తున్నట్లు టిప్పర్లకు ముందు స్టిక్కర్లు అట్టించుకుని యథేచ్ఛగా తిరుగుతున్నారు.

సరూర్‌నగర్‌ మండలంలో..

మన్సూరాబాద్‌ (ఆటోనగర్‌) రెవెన్యూ సర్వే నంబర్‌ 38లో ఓ నిర్మాణ సంస్థ ఏడు ఎకరాల విస్తీర్ణంలో సెల్లార్‌ తవ్వకాలు చేపట్టింది. జిలెటెన్‌ స్టిక్స్‌తో బ్లాస్టింగ్‌ పనులు చేస్తుండటంతో పక్కనే ఉన్న ఇళ్లు, బోరు బావులు దెబ్బతింటున్నాయి. స్థానికులు మైనింగ్‌శాఖకు ఫిర్యాదు చేశారు. 1966 టీజీఎంఎంసీ రూల్స్‌(22/2)కు భిన్నంగా వ్యవహరించినట్లు గుర్తించారు. తీసుకున్న అనుమతులకు భిన్నంగా 35,726.38 మెట్రిక్‌ టన్నుల మట్టిని తవ్వినట్లు లెక్కించి.. పదిరెట్లు అధికంగా రూ.77 లక్షలకుపైగా ఫెనాల్టీ వేసి నోటీసులు జారీ చేశారు. ఇక్కడి తవ్వకాలతో ప్రభుత్వానికి రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. అయినా తవ్వకాలు ఆపకపోవడంతో ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌, సరూర్‌నగర్‌ తహసీల్దార్‌, వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. హయత్‌నగర్‌ మండలం విజయవాడ ప్రధాన రహదారిపై సంగం హోటల్‌ ఎదురుగా భారీ అక్రమ సెల్లార్‌ తవ్వకంపై కూడా హయత్‌నగర్‌ తహసీల్దార్‌, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహేశ్వరం మండలంలో..

శ్రీనగర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 185,188,189లో ఓ మైనింగ్‌ కాంట్రాక్ట్‌ సంస్థ 10 వేల మెట్రిక్‌ టన్నుల తవ్వకాలకు తాత్కాలిక అనుమతులు పొందింది. అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టడంతోపాటు రాయల్టీ ఎగ్గొట్టి ప్రభుత్వానికి నష్టాన్ని మిగిల్చింది. అక్రమ తవ్వకాలపై స్థానికులు ఇటీవల మైనింగ్‌శాఖకు ఫిర్యాదు చేయగా ఫెనాల్టీ విధిస్తూ నోటీసులతో సరిపెట్టారు. రాత్రి పూట గుట్టుగా చేపడుతున్న తవ్వకాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా మహేశ్వరం తహసీల్దార్‌, పహాడీషరీఫ్‌ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి.

ఇబ్రహీంపట్నం మంగళ్‌పల్లి సర్వే నంబర్‌ 313లోనూ అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. తీసుకున్న అనుమతులకు భిన్నంగా ఎక్కువ మొత్తంలో తవ్వకాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సర్వే నంబర్‌ 1146లోని ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేపడుతున్నారు. ఇదే అంశంపై ఇటీవల ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌, పోలీసు స్టేషన్లలో మైనింగ్‌శాఖ అధికారులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. అయితే లారీల సీజ్‌, కేసుల నమోదులో వివక్ష చూపుతున్నట్లు విమర్శలు లేకపోలేదు.

మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోంది.. అక్రమార్కులు అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతూ కొండలను పిండి చేస్తున్నారు.. అటు పర్యావరణానికి హాని తలపెట్టడంతోపాటు ఇటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు.

డిటోనేటర్లతో యథేచ్ఛగా పేలుళ్లు

అడ్డగోలుగా మట్టి, గ్రానైట్‌ తవ్వకాలు

కొండలు, గుట్టలు మాయం

భారీగా చెట్ల తొలగింపు

పర్యావరణానికి తీవ్ర ముప్పు

చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న ఆయా శాఖల అధికారులు

మైనింగ్‌ మాఫియా! 1
1/1

మైనింగ్‌ మాఫియా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement