కులదురహంకార హత్యలను అరికట్టాలి
షాద్‌నగర్‌రూరల్: ఎల్లంపల్లిలో జరిగిన కుల దురహంకార హత్యపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని సామాజిక, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద నుంచి ఎల్లంపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. మృతుడి ఇంటివద్ద న్యాయవాది సంగమేశ్వర్ అధ్యక్షతన ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న కులదురహంకార హత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. ఆలిండియా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ.. హత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి నిలువ నీడ లేదని, ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, మృతుడి భార్య వాణికి ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇవ్వాలన్నారు. మాదిగ ఐక్యవేదిక కన్వీనర్ దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఘటనపై విచారణ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తక్షణమే ఎస్సీ, ఎస్టీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాట్లాడుతూ.. ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని అన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు సోమవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎల్లంపల్లికి రానున్నారని తెలిపారు. ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు భిక్షపతి మాట్లాడుతూ.. 11 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 142 కుల దురహంకార హత్యలు జరిగినా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. కార్యక్రమంలో సామాజిక, ప్రజా సంఘాల నాయకులు రాజు, బోడ సామేల్, జగన్, శ్రీనునాయక్, బాదేపల్లి సిద్ధార్థ, జగదీష్, ఈశ్వర్‌నాయక్, చెన్నయ్య, శంకర్, శివ, అనిల్, జాంగారి రవి, సురేందర్, వెంకటయ్య, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక, ప్రజా సంఘాల నేతలు


