ఎస్సీ వర్గీకరణను సవరించాలి
హుడాకాంప్లెక్స్: సుప్రీంకోర్టు సూచనకు విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టారని, మాలలకు అన్యాయం జరిగే వర్గీకరణను సవరించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం మాలల రణభేరి మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ల శాతం పెంచాలని, పెండింగ్‌లో ఉన్న ఎస్సీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని అన్నారు. మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ 99 రోస్టర్ పాయింట్ల విధానంతో రాష్ట్రంలోని 40లక్షల మంది మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలు ఏకమై 33 జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, జిల్లా యూత్ అధ్యక్షుడు చేగూరి శంకర్, ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు మల్లేశ్వరి, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య


