మహిళలను ఉన్నతస్థానంలో నిలుపుతాం
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని దాదాపు కోటి మందికి ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. 18 ఏళ్లు నిండిన ఆడపడుచులకు గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలు నిర్ణయించిన మోడల్ చీరలను పంపిణీకి ఎంపిక చేశామన్నారు. గ్రామ, మండల సమాఖ్య బాధ్యులు బాధ్యత తీసుకొని మహిళలకు చీరలు అందేలా చూడాలన్నారు. రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటు, బస్సుల కొనుగోలు వంటి వ్యాపారంలో మహిళా సంఘాలకు తోడ్పాటునిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నట్టు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, సన్నబియ్యం తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తు చేశారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వీరపల్లి శంకర్, టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు


