మొయినాబాద్‌లో ట్రాఫికర్
చర్యలు తీసుకుంటున్నాం
మొయినాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న షాపులు, హోటళ్ల ముందు పార్కింగ్ సరిగా లేక వాహనదారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. షాపుల ముందు బడ్డీ కొట్లు ఏర్పాటు చేయడంతో వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారు. దీంతో ప్రతి రోజు ప్రధాన చౌరస్తాతోపాటు హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అవుతోంది. దీన్ని పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం, పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. హిమాయత్‌నగర్ చౌరస్తా నుంచి అజీజ్‌నగర్ చౌరస్తా వరకు హోటళ్లు, గ్రానైట్, టైల్స్ షాపులు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా హోటళ్ల వద్ద వాహనాలకు సరిపడా పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్లపైనే నిలుపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.
అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం
వ్యాపార సముదాయాలు, షాపులు, హోటళ్లకు మున్సిపల్ కార్యాలయం నుంచి నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంది. మున్సిపల్ అధికారులు ట్రేడ్ లైసెన్స్‌లపై దృష్టి పెట్టకుండా మామూళ్లకు ఆశపడి ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాల ముందు ఖాళీ స్థలం ఎంత ఉంది.. పార్కింగ్ స్థలం ఉందా అనే విషయాలను పట్టించుకోవడంలేదు. దీంతో షాపుల ముందు ఉన్న స్థలాన్ని కబ్జాచేసి బడ్డీకొట్లకు అద్దెకిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. షాపుల ముందు అక్రమంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసినా పట్టించుకోవడంలేదు.
వీఐపీ రూట్‌గా ప్రకటించినా..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాద్–బీజాపూర్ రహదారిని వీఐపీ మూమెంట్ రూట్‌గా ప్రకటించారు. సీఎం కొడంగల్ వెళ్లాలంటే ఇదే రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తన నియోజకవర్గం వికారాబాద్‌కు వెళ్లాలన్నా ఈ మార్గం నుంచే వెళ్లాలి. వారంలో రెండు మూడు సార్లు ఆయన వికారాబాద్ వెళ్లి వస్తూ ఉంటారు. పోలీసులు వీఐపీ మూమెంట్ రూట్‌గా ప్రకటించినప్పటికీ అందుకు తగ్గట్లు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
ఫొటోలు తీసి చలాన్లు వేసి..
ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీయడం, చలాన్లు వసూలు చేయడానికే పరిమితమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిత్యం ట్రాఫిక్ జాం అవుతున్నా క్లియర్ చేయకుండా రోడ్డుపక్కన నిలిపిన వాహనాల ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారు. షాపుల ముందు పార్కింగ్ స్థలం లేక రోడ్డుపక్కన వాహనాలు నిలిపితే ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ జాం
షాపులు, హోటళ్ల ముందు పార్కింగ్ స్థలం కరువు
రోడ్లపైనే నిలుపుతున్న వాహనాలు
రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
షాపుల ముందు పార్కింగ్ స్థలం లేక రోడ్లపై నిలిపే వాహనాలకు చలాన్లు వేస్తున్నాం. షాపుల ముందు సామాన్లు పెట్టినా, బడ్డీకొట్లు పెట్టినా తొలగించేందుకు నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు సూచించాం. వాహనాల రాకపోకలు పెరగడంతోనే ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– వెంకటేశం, ట్రాఫిక్ సీఐ, చేవెళ్ల


