
అలైన్‌మెంట్ ఖరారు
ఆమనగల్లు: రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అలైన్‌మెంట్ ఖరారైంది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్‌న్ ఇటీవల విడుదల చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ను వంద మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో 26 రెవెన్యూ గ్రామాల మీదుగా నిర్మించనున్నారు. ఈ మేరకు ఏఏ మండలాలలో ఏఏ గ్రామాలలో రోడ్డు నిర్మిస్తున్నారో నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఇన్నాళ్లు ట్రిబుల్‌ఆర్ నిర్మాణంతో తమ పొలాలు పోతున్నాయో లేదో అంటూ ఎదురుచూసిన రైతుల ఉత్కంఠకు తెరదించారు. ప్రాథమిక నోటిఫికేషన్‌పై ప్రజలు, సంస్థలు తమ అభ్యంతరాలను ఈనెల 15 లోగా రాతపూర్వకంగా తెలియజేయాలని హెచ్‌ఎండీఏ కోరింది.
ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల మీదుగా వంద మీటర్ల వెడల్పుతో రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నట్లు వివరాలు హెచ్‌ఎండీఏ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంతో రెండు భాగాలుగా నిర్మించనున్నారు. ఇప్పటికే ఉత్తరభాగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు టెండర్లు కూడా పిలిచింది. తాజాగా దక్షిణభాగం రోడ్డుకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో డిజిటల్ మ్యాప్‌తో పాటు ఆర్‌ఆర్‌ఆర్ వెళ్లే సర్వే నంబర్ల వివరాలను వెల్లడించారు.
ట్రిబుల్‌ఆర్ లోపలే మాడ్గుల, ఆమనగల్లు
ట్రిబుల్‌ఆర్ లోపలికే ఆమనగల్లు, మాడ్గుల మండల కేంద్రాలు రానున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అలైన్‌మెంట్ ప్రకారం ఆమనగల్లు మండలంలోని విఠాయిపల్లి, ఆకుతోటపల్లి, శెట్టిపల్లి, మాడ్గుల మండలంలోని కొల్కులపల్లి, నర్సాయిపల్లి గ్రామాల మధ్య నిర్మించనున్నట్లు అప్పట్లో సర్వే చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రిబుల్‌ఆర్ అలైన్‌మెంట్ కోసం మరోసారి సర్వే నిర్వహించారు. రోడ్డును మాడ్గుల మండల కేంద్రం బయట నుంచి నిర్మించాలని, కాంగ్రెస్ నాయకులు కోరడంతో అలైన్‌మెంట్‌లో భారీగా మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఆమనగల్లు, మాడ్గుల మండల కేంద్రాలు ఆర్‌ఆర్‌ఆర్ లోపలే ఉంటున్నాయి.
26 గ్రామాల మీదుగా..
జిల్లా పరిధిలోని ఆరు మండలాలలోని 26 రెవెన్యూ గ్రామాల మీదుగా ట్రిబుల్‌ఆర్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. మండలంలోని ఆమనగల్లు, చెన్నంపల్లి, పోలెపల్లి, సింగంపల్లి, కేశంపేట మండలంలోని నిడుదవెల్లి, తొమ్మిదిరేకుల, ఫరూక్‌నగర్ మండలంలోని భీమారం, చించోడు, కొందుర్గు మండలంలోని ఆగిర్యాల, కొందుర్గు వెస్ట్, తంగల్లపల్లి, వనంపల్లి, చెర్కుపల్లి, కొందుర్గు ఈస్ట్, మాడ్గుల మండలంలోని ఇర్విన్, కలకొండ, మాడ్గుల, అన్నెబోయినపల్లి, బ్రాహ్మణపల్లి, తలకొండపల్లి మండలంలోని కానాపూర్, మెదక్‌పల్లి, రాంపూర్, వెంకట్రావ్‌పేట, చంద్రదన, గౌరిపల్లి, జూలపల్లి గ్రామాలున్నాయి.
భూములు తీసుకోవద్దని వినతి
ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంతో తమ భూములు పోకుండా చూడాలని పలు గ్రామస్తులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ ఖరారు చేస్తూ వివిధ గ్రామాలు, సర్వే నంబర్ల వివరాలను వెల్లడించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో కసిరెడ్డిని ఆమనగల్లు మండలం సింగంపల్లి, తలకొండపల్లి మండలం గౌరిపల్లి, నల్లరాల్ల తండాకు చెందిన పలువురు రైతులు కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌లో తమ భూములు పోకుండా చూడాలని అభ్యర్థించారు.
వందమీటర్ల వెడల్పుతో
రీజనల్ రింగ్ రోడ్డు
జిల్లాలోని ఆరు మండలాలు,
26 గ్రామాల్లో రహదారి
నోటిఫికేషన్ విడుదల చేసిన హెచ్‌ఎండీఏ
ఈ నెల 15 వరకు అభ్యంతరాల స్వీకరణ

అలైన్‌మెంట్ ఖరారు