
కార్మిక హక్కులను కాలరాయొద్దు
● సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
చంద్రమోహన్
● కందుకూరులో యూనియన్
సర్వసభ్య సమావేశం
కందుకూరు: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అమలవుతున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలు సరికాదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రమోహన్, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి.కవిత అన్నారు. మండల కేంద్రంలోని సీతారామశాస్త్రి ఫంక్షన్ హాల్‌లో బుధవారం యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల హక్కులను కాల రాశారన్నారు. ఈ విషయమై కార్మికులు ఆందోళనలు చేయకుండా భయపెడుతున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు మందలించినా కేంద్రం తీరు మారడం లేదని అసహనం వ్యక్తంచేశారు. ఎర్ర జెండా పోరాటంతో ఎనిమిది గంటల పని విధానం అమలులోకి రాగా, దాన్ని తుంగలో తొక్కి 12గంటలు అమలు చేస్తున్నారని తెలిపారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఐటీయూ మండల నూతన కమిటీ కన్వీనర్‌గా బుడ్డీరపు శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు, వ్యవసాయ కార్మిక, ఆశ, వీఓఏ, బీసీడబ్ల్యూ, మధ్యాహ్న భోజన, ఎఫ్‌ఏల, భగీరథ, ఆర్టీసీ, భవన నిర్మాణ, పంచాయతీ తదితర కార్మిక సంఘాల నాయకులు అంకగళ్ల కుమార్, శ్రీలత, సరస్వతి, బండి సత్తయ్య, పోల్కం శ్రీరాములు, కె.శ్రీనివాస్, రసింహ, లక్ష్మణ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.