
ఆరువేల మందితో బందోబస్తు
● వినాయక నిమజ్జనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
● సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి
మూసాపేట: సైబరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన కూకట్‌పల్లిలోని ఐడిఎల్ రంగధాముని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 వేల మంది పోలీసులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన 700కు పైగా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నాన్నారు. రాబోయే మూడు రోజుల్లో వినాయక నిమజ్జనాలు భారీ ఎత్తున జరగనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. చివరి రోజు నిమజ్జన ఏర్పాట్లపై ఇప్పటికే అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసినట్లు తెలిపారు. భక్తులు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసులతో గస్తీ నిర్వహిస్తూనే సీసీటీవీల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో బాలానగర్ జోన్ డీసీపీ సురేష్‌కుమార్, కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్, కూకట్‌పల్లి సీఐ కె.వి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ అరెస్టు పేరుతో టోకరా
నిందితుడి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కర్నాటకకు చెందిన ప్రతాప్ కేసరి ప్రధాన్ బెంగళూరులోని తిరుమలశెట్టిహళ్లిలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కస్టమర్లకు పొదుపు, కరెంట్ ఖాతాలు తెరవడం, కస్టమర్లతో సంబంధాలు నిర్వహించడం అతడి బాధ్యత. ఈ క్రమంలో కస్టమర్లకు కమీషన్ ఆశ చూపించి, వారి నుంచి ఖాతా వివరాలను తీసుకుని వాటిని సైబర్ నేరగాళ్లకు చేరవేస్తూ అక్రమంగా డబ్బు సంపాదించేవాడు. వారు ఆయా ఖాతాలను సైబర్ నేరాలు, మోసాలకు వినియోగించేవారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన మహిళకు గత జులైలో సైబర్ నేరగాడు ప్రదీప్ సావంత్ అనే వ్యక్తి ఫోన్ చేసి, ముంబైలోని అంధేరి ఈస్ట్ పోలీసు అధికారిగా పరిచయం చేసుకున్నారు. బాధితురాలి బ్యాంక్ ఖాతా నుంచి అనధికారికంగా లావాదేవీలు జరిగాయని, మనీలాండరింగ్ కేసు నమోదైందని ఆమెను భయభ్రాంతులకు గురి చేశారు. ఆర్‌బీఐ, సీబీఐ, ఈడీ అధికారులుగా నటిస్తూ బాధితురాలిని ఏకంగా ఆరు గంటల పాటు వీడియో కాల్‌లో విచారించారు. వాట్సాప్ ద్వారా నకిలీ గుర్తింపు కార్డులు, అరెస్టు వారెంట్లను పంపించి బాధితురాలిని భయపెట్టారు. ఆర్‌బీఐ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ రాగానే 24 గంటల్లోపు డబ్బును తిరిగి చెల్లిస్తామని నమ్మించి, బాధితురాలి ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి రూ.10.02 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో నిందితుడు ప్రతాప్ కేసరి ప్రధాన్‌ను అరెస్టు చేశారు. అతడిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు కేసులు ఉండగా.. తెలంగాణలో రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు.