
బాలుడి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: మేనమామ మందలించడంతో బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన దుర్గానాథ్ కొన్నేళ్ల క్రితం జల్‌పల్లికి జీవనోపాధి నిమిత్తం వలస వచ్చాడు. తల్లిదండ్రులు లేని అతని మేనల్లుడు ప్రవీణ్‌నాథ్(12) ఇతని వద్దే ఉంటాడు. తరచూ అల్లరి చేసే ప్రవీణ్‌ను మేనమామ గత నెల 31వ తేదీన రాత్రి మందలించాడు. ఉదయం లేచి చూసేసరికి కనిపించలేదు. అతని ఆచూకీ కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై మంగళవారం రాత్రి దుర్గానాథ్ పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లో గాని సమాచారం అందించాలని కోరారు.
హెడ్ కానిస్టేబుల్‌పై
యువకుల దాడి
రహమత్‌నగర్: గణేశ్ నిమజ్జన యాత్ర సందర్భంగా హెడ్ కానిస్టేబుల్‌పై యువకులు దాడి చేసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి ఈఎస్‌ఐ విజయలక్ష్మీ ఆలయం వద్ద వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళుతున్నాయి. ఆ సమయంలో ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ యువకులు గొడవ చేస్తుండటాన్ని తన సెల్ ఫోన్‌లో రికార్డు చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన వారు హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బోరబండ పోలీసులు గణేశ్ మండప నిర్వాహకులకు ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆరిఫ్ మృతదేహం వెలికితీత
రాజేంద్రనగర్: హిమాయత్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఆరీఫ్ మృతదేహన్ని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బుధవారం వెలికి తీశారు. జీవితంపై విరక్తి చెంది ఆరీఫ్ అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆరీఫ్ మృతదేహన్ని వెలికి తీసిన అనంతరం రాజేంద్రనగర్ పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఆరీఫ్ కాలుకు గాయం కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.