గణేశ్‌ లడ్డూల చోరీ.. ఇన్‌స్టాలో పోస్ట్‌! | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ లడ్డూల చోరీ.. ఇన్‌స్టాలో పోస్ట్‌!

Sep 4 2025 8:41 AM | Updated on Sep 4 2025 8:41 AM

గణేశ్‌ లడ్డూల చోరీ..  ఇన్‌స్టాలో పోస్ట్‌!

గణేశ్‌ లడ్డూల చోరీ.. ఇన్‌స్టాలో పోస్ట్‌!

ఆదిబట్ల పీఎస్‌లో ఏడుగురిపై కేసు నమోదు

ఇబ్రహీంపట్నం రూరల్‌: మండపాల్లోని గణేశుడి లడ్డూలు చోరీ చేసి, తిన్న ఏడుగురు యువకులపై పోలీసు కేసు నమోదైంది. ఆదిబట్ల ఎస్‌ఐ సైదయ్య కథనం ప్రకారం.. ఉపాధి నిమిత్తం మన్నెగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న సాయితేజ, శివకుమార్‌ వినాయకుడి లడ్డూలను చోరీ చేసి, తింటే మంచి జరుగుతుందని నమ్మి రాత్రి వేళ మన్నెగూడలోని ఎన్‌ఎస్‌ఆర్‌నగర్‌, మహోనియా ఆస్పత్రి వెనకాల, ఎంఎంకుంట ప్రాంతాల్లోని పలు వినాయక విగ్రహాల చేతుల్లో ఉన్న లడ్డూలను దొంగిలించారు. అబ్బు, ప్రవీణ్‌, రాహుల్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లతో కలిసి లడ్డూలను తినేశారు. అంతటితో ఆగకుండా లడ్డూలు చోరీ చేసిన సమయంలో తీసుకున్న వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఉదయాన్నే లడ్డూలు లేకపోవడాన్ని గమనించిన నిర్వాహకులకు ఇన్‌స్టాలో వీరు షేర్‌ చేసిన వీడియోలు కనిపించడంతో, నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మట్టి తరలిస్తున్న టిప్పర్లు సీజ్‌

ఇబ్రహీంపట్నంరూరల్‌: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పోలీసులు సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్‌ కథనం ప్రకారం.. రావిర్యాల, నాదర్‌గుల్‌ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. నాలుగు టిప్పర్లను స్వాధీనం చేసు కొని సీజ్‌ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

మహిళ మెడలో గొలుసు చోరీ

సనత్‌నగర్‌: నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళ మెడలోని 1.5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సనత్‌నగర్‌ ఎస్సార్టీకాలనీకి చెందిన కడారి రమాదేవి ఈ నెల 1న సాయంత్రం స్థానిక నెహ్రు పార్కు సమీపంలోని గణేష్‌ మండపానికి వచ్చింది. రాత్రి ఇంటికి తిరిగి వెళుతుండగా సాయిబాబా ఆలయ సమీపంలో బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని 1.5 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌పై వచ్చిన వ్యక్తి స్కైబ్లూ కలర్‌ జర్కిన్‌ ధరించినట్లు బాధితురాలు పేర్కొంది.

బైక్‌ అదుపుతప్పి ఉద్యోగి మృతి

హస్తినాపురం: బైక్‌ అదుపుతప్పి కింద పడడంతో తీవ్రంగా గాయపడిన సాఫ్ట్‌వేర్‌ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక హైకోర్టు కాలనీకి చెందిన దుర్గంపూడి అంజిరెడ్డి(43) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను బైక్‌పై వెళుతుండగా పనామాచౌరస్తా సమీపంలోని మాక్స్‌విజన్‌ ఐ ఆసుపత్రి వద్ద బైక్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని గుర్తించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. ఆయన్ని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు గోపాలకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement