
యూరియా కొరత తీర్చండి
సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య
ఇబ్రహీంపట్నం: యూరియా కొరతను తీర్చి రైతు లు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇబ్రహీంపట్నంలో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉంచాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే సాగు విస్తీర్ణంపై అంచనా వేసి సకాలంలో యూరియాను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు యూరియా అంశంపై కేంద్రాన్ని నిలదీయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి యూరియా పంపిణీ చేయాలని నొక్కి చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సామేల్, చంద్రమోహన్, జగదీష్, నర్సింహ, కవిత, శోభన్, అంజయ్య, జంగయ్య, రుద్రకుమార్, సుమలత, బుగ్గరాములు, విజయ్‌కుమార్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
రోడ్డెక్కిన రైతులు
షాబాద్: వానాకాలం పంటల సాగు ఊపందుకోవడంతో రైతులు యూరియా కోసం నానా తంటాలు పడుతున్నారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం పక్కనే ముంబాయి– బెంగళూరు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు కిలోమీటర్లు పొడవునా వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గంటల తరబడి క్యూలో నిల్చుంటే యూరియా ఇవ్వకపోవడంతో రైతులు ధర్నాకు దిగారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమించారు.