
ఆక్రమణలు తొలగించిన హైడ్రా
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి సర్వే నంబర్ 201లోని శ్రీ సూర్య సాయి నగర్‌లో పార్కు ఆక్రమణలను శనివారం హైడ్రా అధికారుల బృందం కూల్చివేసింది. కాలనీలోని 482 గజాల విస్తీర్ణంలో 283, 284 నంబర్ ప్లాట్లను 2018లో మున్సిపాలిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అయినప్పటికీ కొందరు స్థానికులు ప్రహరీ నిర్మించి ఆక్రమించారు. దీనిపై కాలనీవాసులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఇటీవల హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. తాజాగా హైడ్రా ఇన్‌స్పెక్టర్ తిరుమలేశ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం పార్కు స్థలంలోని నిర్మాణాలను కూల్చివేశారు. కొలతలు వేసి, మున్సిపల్ అధికారుల చేత బోర్డు ఏర్పాటు చేయించారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాము 20 ఏళ్లుగా సర్వే నంబర్ 159లో కబ్జాలో ఉన్నామని, గతంలో హైడ్రా నుంచి నోటీసులు వచ్చినప్పటికీ రిప్లై ఇచ్చామని, అవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టారని కబ్జాలో ఉన్న రైతులు వాపోయారు. గతంలో హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు కూడా తమకు అనుకూలంగా ఉందని గుర్తు చేశారు. హైడ్రా ఏడీ సర్వే చేపట్టి రిపోర్టు ఆధారంగా భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు.
ప్రీకాస్టు వాల్ తొలగింపు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు. రోడ్డుకు అడ్డంగా వేసిన ప్రీకాస్టు వాల్ తొలగించి రోడ్డుకు విముక్తి కల్పించారు. మున్సిపల్ కేంద్రంలోని బీరప్ప గుడికి సమీపంలో చక్రధర వెంచర్‌లో రోడ్డుకు అడ్డంగా కొంతమంది ప్రీకాస్టు వాల్ నిర్మించారు. ఈ విషయమై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారుల దృష్టికి వెళ్లడంతో శనివారం హైడ్రా సీఐ తిరుమలేశ్ ఆధ్వర్యంలో జేసీబీలతో వాటిని తొలగించారు. ఈ సందర్భంగా సీఐ తిరుమలేష్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా పనులు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. నిర్భయంగా హైడ్రాను సంప్రదిస్తే తగున్యాయం చేస్తామని తెలిపారు.