
ఫిల్మ్‌సిటీ కబ్జాలను వెలికితీయాలి
● బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలను తొలగించాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య
ఇబ్రహీంపట్నం రూరల్: రామోజీఫిల్మ్‌సిటీ యాజమాన్యం కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి ప్రజలకు పంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఫిల్మ్‌సిటీ యాజమాన్యం వేముల కత్వా, ఇందిరా సాగర్, పటేల్‌కుంటల్లో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ను ఆక్రమించి భారీ ప్రహరీలను నిర్మించిందని తెలిపారు. ఫిల్మ్‌సిటీ మెయిన్‌గేటు వద్ద బఫర్‌జోన్‌లో నిర్మాణం చేపట్టారని, ఇందిరా సాగర్‌ను పూర్తిగా ఆక్రమించారని ఆరోపించారు. ఫిల్మ్‌సిటీ యాజమాన్యం అక్రమణలకు అడ్డులేకుండా పోయిందని మండిపడ్డారు. సర్వే నంబర్ 307లో 60 ఎకరాలకు పైగా భూమి ఉందని, అందులో 20 ఎకరాలు ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ పేరున ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్నారు. 301 సర్వే నంబర్‌లో ఆరు ఎకరాలు అనాజ్‌పూర్ ఎస్సీ రైతులకు పట్టాలు ఇచ్చారని, ఆ భూమి ఫిల్మ్‌సిటీ లోపల ఉండడంతో రైతులు రాకపోకలు సాగించకుండా కోర్టు ఆర్డర్ అడ్డం పెట్టుకొని ఫిల్మ్‌సిటీ ఆధీనంలో పెట్టుకుందని విమర్శించారు. సర్వే నంబర్ 251లో పది ఎకరాలు ఆక్రమించారని, ప్రభుత్వం వెంటనే సర్వే చేసి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని వెలికితీసి భూమిలేని పేదలకు పంచాలన్నారు. కలెక్టర్ స్పందించి సమగ్ర సర్వే చేపట్టాలని కోరారు. లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్సింహ, మహేశ్, బాలరాజ్, కావలి రాములు, మల్లయ్య, రవి, వెంకటేష్, బాల్‌రాజ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు