ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో పెట్టొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్‌ఓ సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం మొత్తం 70 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మండల, గ్రామస్థాయిలో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. వన మహోత్సవంలో ఆయా శాఖలకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పేమెంట్స్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దారులు, కలెక్టరేట్, సూపరింటెండెంట్‌లు తదితరులు పాల్గొన్నారు.


