
నవ్విపోదురుగాక!
● అధికారుల అనాలోచిత నిర్ణయాలు
● ముర్తూజగూడలో ఇప్పటికే సబ్‌స్టేషన్ పనులు షురూ
● తాజాగా శంకుస్థాపన పేరుతో హడావుడి
● స్థానికుల అభ్యంతరంతో శిలాఫలకంలో పేరు మార్పు
● ఇటీవల తుక్కుగూడలోని ఆస్పత్రికీ ఇదే తరహా శంకుస్థాపన
● నిర్లక్ష్యంతో విమర్శలు మూటగట్టుకుంటున్న వైనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికారుల అనాలోచిత నిర్ణయాలు విస్తుగొలుపుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలోనూ అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తుక్కుగూడలో కనీసం భూమి కూడా కేటాయించని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి చేతుల మీదుగా ఇప్పటికే శంకుస్థాపన చేయించి నవ్వులపాలయ్యారు. తాజాగా మొయినాబాద్‌లో మరో వివాదానికి కారణమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై.. ఏకంగా పనులు చివరి దశకు చేరుకున్న సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన పేరుతో హడావుడి చేయడం గమనార్హం. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమాన్ని సైతం నిర్లక్ష్యంగా రూపకల్పన చేయడం విమర్శలకు తావిస్తోంది.
ఏడాదిన్నరక్రితమే పనులు షురూ
మొయినాబాద్ పరిసర గ్రామాల్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం ముర్తూజగూడలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.8 కోట్లు మంజూరు చేసింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో శంకుస్థాపన పనులు నిలిచిపోయాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు ఏడాదిన్నర క్రితమే దీనికి భూమి పూజ చేసి, నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆయా పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. తాజాగా ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమానికి గత సోమవారం ఏర్పాట్లు చేయడం, స్థానికులు అధికారులను నిలదీయడం వివాదాస్పదంగా మారింది. చివరికి అధికారులు శిలాఫలాకాలపై పేర్లు మార్చి ఇతర సబ్‌స్టేషన్ల పేరుతో అదే వేదికగా శంకుస్థాపన చేయాల్సి వచ్చింది.
అసలేమైందంటే..?
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 30 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. 1,02,811 గృహ, 24,969 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ కొత్తగా అనేక గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు వెలుస్తున్నాయి. విద్యుత్ వినియోగం రెట్టింపవుతోంది. సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్యను నియంత్రించడంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్తగా మరో ఐదు సబ్‌స్టేషన్లు మంజూరు చేసింది. రూ.20.5 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించతలపెట్టింది. వీటిలో చిలుకూరు (నాగిరెడ్డిగూడ), బాకారం, నర్రెగూడలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. కొత్తగా నిర్మించదలచిన ప్రదేశంలో కాకుండా ఇప్పటికే మంజూరై, పనులు వివిధ దశల్లో కొనసాగుతున్న ముర్తూజగూడలో ఆయా సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముర్తూజగూడలో రూ.8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సబ్‌స్టేషన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. పనులు ప్రారంభమైన ప్రదేశంలోనే మళ్లీ శంకుస్థాపన అంటూ అధికారులు హడావుడి చేయడం, మీడియాకు ఆహ్వానాలు పంపడం, స్థానికులు అడ్డుతగలడం, తర్వాత మేల్కొని శిలాఫలకాలు మార్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.