
వర్షాల వేళ జాగ్రత్త
ఇబ్రహీంపట్నం రూరల్: భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం భారీ వర్షాలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించినందున ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తమ యాక్షన్ టీంలకు సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్లు, సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని తెలిపారు. కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకొని 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. విద్యుత్, రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్‌శాఖలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రమాదకరంగా ఉండే నాలాలను గుర్తించి మందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని, పాఠశాలలు, హాస్టళ్లతో పాటు పురాతన భవనాల్లోని సాధారణ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరతలించా లన్నారు. భారీ వర్షాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఫంక్షన్ హాళ్లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదకర చెరువులు, ప్రాజెక్టులను పరిశీలించి లీకేజీలు ఉంటే గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అన్నారు. షార్ట్ సర్క్యూట్ జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తం చేయాలన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని, ముందస్తుగా నిల్వ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున వన మహోత్సవంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణాలు పూర్తయిన వాటికి బిల్లులు వెంటనే మంజూరు చేయాలని, డీవియేషన్‌తో నిలిచిపోయిన ఇళ్లకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇవ్వాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు ఈ నెల 16లోగా ప్రతిపాదనలు పంపాలన్నారు. వరదలు, ప్రమాదాలు సంభవిస్తే అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 79931 03347, 040 23237416కు సమాచారం అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ సంగీత , డీఆర్డీఓ పీడీ శ్రీలత , డీపీఓ సురేష్‌మోహన్, వ్యవసాయ శాఖ అధికారి ఉష, హౌసింగ్ పీడీ నాయక్, డీఈఓ సుశీందరావు, ఎస్సీ సంక్షేమ అధికారి రామారావు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ నారాయణరెడ్డి