
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
షాద్‌నగర్: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర అని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కాశిరెడ్డిగూడలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరరహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం
షాద్‌నగర్: విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తున్నామని అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్‌ఎఫ్) జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహాన్ అన్నారు. సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం పట్టణంలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలకు పైగా ఎన్నో ఉద్యమాలు చేపట్టి సమస్యలు పరిష్కరించుకోగలిగామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్, నాయకులు సాయి చౌహాన్, రాహుల్, అరుణ్, ప్రకాష్, సునీల్, గణేశ్, అంకిత, నిఖిత, నందిని తదితరులు పాల్గొన్నారు.
విజయ పాలసేకరణ
కేంద్రం ప్రారంభం
ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలోని జంగారెడ్డిపల్లిలో పాడిపరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ పాలసేకరణ కేంద్రాన్ని మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో పాడిరైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీసింగ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కిషన్‌రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ బొజ్జ సాయిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శంకర్ పాల్గొన్నారు.
మేడిగడ్డతండా కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
ఆమనగల్లు: మండలంలోని మేడిగడ్డతండా కార్యదర్శి పి.వెంకటయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధుల దుర్వినియోగం, చట్టబద్ధమైన బాధ్యతలు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంకటయ్య మండల పరిధిలోని మంగళపల్లి ఇన్‌చార్జి గ్రామ కార్యదర్శిగా పనిచేస్తూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఖాతాద్వారా రూ.2.55 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని వాడుకున్నాడు. మేడిగడ్డతండాలో పన్నుల ద్వారా వచ్చిన రూ.76,875, కోనాపూర్ పంచాయతీలో పనిచేసిన సమయంలో రూ.16,342 ట్రెజరీలో జమచేయకుండా సొంతానికి వాడుకున్నట్లు గుర్తించారు. ఎంపీ డీఓ ఇచ్చిన నివేదిక మేరకు వెంకటయ్యను సస్పెండ్ చేశారు.
ఆరుట్ల కార్యదర్శికి షోకాజ్ నోటీసు
మంచాల: మండలంలోని ఆరుట్ల పంచాయతీ కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్‌కు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి సురేష్‌మోహన్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడ్డాడని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడని డీపీఓ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు వివరణ కోరుతూ మంగళవారం నోటీసు జారీ చేశారు. ఇదే విషయమై ఎంపీడీఓ బాలశంకర్‌ను వివరణ కోరగా నోటీసు వచ్చిన మాట వాస్తవమే అని తెలిపారు.