
స్వచ్ఛంద సేవలు అభినందనీయం
శంకర్‌పల్లి: టీచ్ ఫర్ చేంజ్, వేనీరావు ఫౌండేషన్ సేవలు అభినందనీయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని జన్వాడ జెడ్పీహెచ్‌ఎస్‌లో టీచ్ ఫర్ చేంజ్, వేనీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు శానిటరీ ఫ్యాడ్స్, విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య, టీచ్ ఫర్ చేంజ్ ఫౌండర్ మంచు లక్ష్మీప్రసన్న, వేనీ రావు ఫౌండేషన్ చైర్‌పర్సన్ రత్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంచు లక్ష్మీప్రసన్న సామాజిక బాధ్యతగా స్వచ్ఛంద సంస్థని స్థాపించి, విద్యార్థులకు సాయం చేయడం గొప్ప విషయమన్నారు. లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ.. 11 ఏళ్ల క్రితం సంస్థను ఏర్పాటు చేశామని.. భవిష్యత్‌లో మరింత విస్తరింపజేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జన్వాడ పాఠశాలలో ఒక స్మార్ట్ తరగతి గది నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తామని.. రానున్న రోజుల్లో మరో మూడు అదనపు తరగతి గదులు నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అక్బర్, శంకర్‌పల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్, నాయకులు గోపాల్‌రెడ్డి, ప్రవీణ్, నర్సింహ, వెంకట్‌రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.