వర్షాకాలం.. విద్యుత్‌తో భద్రం | - | Sakshi
Sakshi News home page

వర్షాకాలం.. విద్యుత్‌తో భద్రం

Aug 11 2025 10:02 AM | Updated on Aug 11 2025 10:02 AM

వర్షాకాలం.. విద్యుత్‌తో భద్రం

వర్షాకాలం.. విద్యుత్‌తో భద్రం

స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సర్వీస్‌ వైర్లతో ప్రాణాలకు ముప్పు

యాలాల: వర్షాకాల నేపథ్యంలో తరచూ వ్యవసాయ బోర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద కరెంటు సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. రైతులు విద్యుత్‌ సరఫరా కోసం తామే స్తంభాలు ఎక్కడం, ఫ్యూజులు మార్చడం, తీగలు సరిచేయడం చేస్తుంటారు. ఇది ఎంతో ప్రమాదకరం. కరెంటు విషయంలో నిపుణులైన ట్రాన్స్‌కోసిబ్బంది వచ్చి సమస్య పరిష్కరించేంత వరకురైతన్నలు ఓపిక పట్టాలని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు సూచనలిస్తున్నారు. ఇటీవల జరిగిన రెండు ఘటనల నేపథ్యంలో మండల ట్రాన్స్‌కో ఇన్‌చార్జ్‌ ఏఈ రఘువీర్‌ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.

సొంత నిర్ణయాలు తీసుకోవద్దు

● రైతులు పొలాల వద్ద ఏర్పడే కరెంటు సమస్యల విషయంలో సొంతంగా మరమ్మతులు చేపట్టేందుకు ముందుకు రావొద్దు. సమస్య వస్తే వెంటనే స్థానిక లైన్‌మెన్‌ లేదా ఏఈకి సమాచారం ఇవ్వాలి.

● వర్షాకాలం నేపథ్యంలో బోర్ల వద్ద, సర్వీస్‌ వైర్లు ముట్టుకునే సమయంలో భూమిపై తడి ఉంటే, తప్పనిసరి తగు భద్రత చర్యలు తీసుకొని ముందుకు వెళ్లాలి. కాళ్లకు తప్పనిసరిగా రబ్బరు చెప్పులు ధరించాలి. తడి చేతులతో ఎట్టి పరిస్థితుల్లో స్టార్టరు, బోర్లు, సర్వీసు వైర్లను తాకవద్దు.

● పొలాల్లోని స్తంభాలపై తీగలు తెగినప్పుడు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు ఎగిరినప్పుడు ట్రాన్స్‌కో అధికారులను సంప్రదించాలి. అలా కాకుండా అనధికార వ్యక్తులు స్తంభాలు ఎక్కడం నేరం. విద్యుత్‌ అధికారులు స్థానిక సబ్‌స్టేషన్‌ నుంచి ఎల్‌సీ తీసుకొని మరమ్మతులకు పూనుకుంటారు.

● రైతులు కరెంటు విషయాల్లో కాస్త ఓపికగా ఉంటే ఎంతో మేలు. అరగంట, గంట ఆలస్యమైన ట్రాన్స్‌కో సిబ్బంది సమస్య ఉన్న ప్రాంతానికి వచ్చేంతవరకు ఆగండి. అంతేకానీ ఆలస్యమవుతుందనే భావనలో ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు.

● విద్యుత్‌ సమస్య పరిష్కారంలో నిపుణులైన ట్రాన్స్‌కో సిబ్బంది, రక్షక పరికరాలతో విద్యుత్‌ స్తంభం ఎక్కడం, మరమ్మతులు చేయడం, కనెక్షన్‌ ఇవ్వడం, ఫ్యూజులు మార్చడం చేస్తుంటారు. ఈ విషయంలో కర్షకులు ట్రాన్స్‌కో సిబ్బందికి సహకరించాలి.

● రైతులు తమ వ్యవసాయ బోర్ల వద్ద, కరెంటు స్తంభాల వద్ద, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ బుడ్డీలు ఏర్పాటు చేసిన ప్రదేశం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. గడ్డి, కంపచెట్లు, ఇతర మొక్కలు పెరగకుండా తొలగిస్తూ ఉండాలి. ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా భూమి చదునుగా ఉండేలా చూడాలి.

● ప్రమాదవశాత్తు రైతులు కానీ, మూగ జీవాలు కానీ మరణిస్తే శాఖ పరంగా ఆర్థికపరమైన సాయం బాధిత కుటుంబాలకు అందుతుంది. ప్రమాద అనంతరం సంబంధిత పత్రాలు, వివరాలను ట్రాన్స్‌కో సిబ్బందికి అందజేస్తే 60 రోజుల్లో పరిహారం అందే అవకాశం ఉంది.

పొలాల వద్ద రైతుల అప్రమత్తత అవసరం

సమస్యలుంటే ట్రాన్స్‌కో సిబ్బందికిసమాచారం ఇవ్వాలి

రఘువీర్‌, ట్రాన్స్‌కో ఇన్‌చార్జ్‌ ఏఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement