
ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్
చేవెళ్ల: అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ సాధించింది చేవెళ్ల మండలం జాలగూడ గ్రామానికి చెందిన అత్తెల్లి అక్షర. గ్రామానికి చెందిన అత్తెల్లి రవీందర్‌రెడ్డి, అనిత దంపతులు కుమార్తె అక్షర చేవెళ్లలోనే పదో తరగతి వరకు చదువుకుంది. ఇంటర్ హైదరాబాద్‌లో పూర్తి చేసి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పాలెం వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చేసింది. మాస్టర్ చదివేందుకు అమెరికాలోని లూథియానా యూనివర్సిటీలో చేరింది. అక్కడ అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేసుకొని ఫ్లోరిడా యూనివర్సటీలో పీహెచ్‌డీలో చేరింది. వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ సాధించడంపై ఆమె కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆదివాసీల సంక్షేమానికి కృషి
డీటీడీఓ రామేశ్వరి దేవి
కడ్తాల్: ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి (డీటీడీఓ) రామేశ్వరి దేవి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం మండల పరిధిలోని మైసిగండి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో పోరాట యోధుడు కొమురంభీం చిత్రపటానికి అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల జీవన విధానం ప్రత్యేకమైనదని, అడవి తల్లిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. అడవిబిడ్డల హక్కుల కోసం కొము రం భీం అహర్నిశలు పాటుపడ్డారని, వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడని కొనియాడారు. గిరిజనులకే కాదు.. అన్ని జాతులకు ఆయన పోరాటం స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో హెచ్‌ఎం పాపయ్య, హెచ్‌డబ్ల్యూఓ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
కొనాలంటే ‘చింత’
తుక్కుగూడ: చింత చిగురును ఇష్టపడని వారుండరు. ఏడాది కాలంలో జూలై నుంచి ఆగస్టు మాసం వరకు అధికంగా లభిస్తుంది. కొమ్మల చివరి ఉన్న చింత చిగురును కొయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో రుచికరమైన చింత చిగురులో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో ధర రూ.1000 నుంచి రూ.1,200 వరకు విక్రయిస్తున్నారు. నానాటికి చింత చెట్ల సంఖ్య తగ్గిపోవడం, చిగురు కోసే వారు లేకపోవడంతో ధర పెరిగిపోతోంది.
అబుదాబిలో రోడ్డు
ప్రమాదం: దంపతుల మృతి
శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని సూరజ్‌గార్డెన్ బస్తీకి చెందిన ఓ కుటుంబం అబుదాబిలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో దంపతులు మరణించగా వారి కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలోని సూరజ్‌గార్డెన్ బస్తీకి చెందిన సయ్యద్ వాహిద్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 7న ఉదయం కారులో ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. సయ్యద్ వాహిద్ సంఘటన స్థలంలోనే మృతిచెందగా అతడి భార్య ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. నాలుగు నెలల బాలుడికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 6, 8 సంవత్సరాల ఇద్దరు కుమార్తెలకు స్వల్పగాయాలయ్యాయి. దీంతో సూరజ్‌గార్డెలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం సాయంత్రం మృతదేహాలు రాగా ఖననం పూర్తి చేశారు.

ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్

ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్