
పూల ధరలకు రెక్కలు
శ్రావణమాసం,పెళ్లిళ్ల సీజన్ కావడంతో..
● రకాలను బట్టి రూ.200 నుంచి రూ.2,500 వరకు..
నవాబుపేట: ఓవైపు శ్రావణమాసం పూజలు.. మరో వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నెల పవిత్ర మాసం కావడంతో పూల వినియోగం భారీగా ఉంది. మహిళలు అమ్మవారిని వివిధ రకాల పూలతో కొలుస్తుంటారు. గత శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నాటి నుంచి పూల రేట్లు మరింత పెరిగాయి. పెళ్లి వేదికను పూలతో అలంకరించడానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆర్థికంగా ఉన్నవారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. వధూవరులు మెడలో ధరించే పూలమాల ధర రూ.2 వేలకు పైగా ధర పలుకుతోంది. సాధారణ రోజులు ఒక మాల రూ.200 నుంచి రూ.500 వరకే ఉంటుంది. ఇక బంతి, చామంతి, మల్లె పూల దండలైతే రూ.1000 పైనే. లిల్లీ పూలదండకూడా భారీ ధర పలుకుతోంది. వారం రోజుల క్రితం మూర పూలు రూ.20కు ఇచ్చే వారు.. ప్రస్తుతం రూ.50 తీసుకుంటున్నారు. కిలో బంతి పూలు రూ.120 నుంచి రూ.150 పలుకుతున్నాయి. చామంతి కిలోకి రూ.300 నుంచి రూ.500 వరకు.. లిల్లీ పూలు కిలోకి రూ.600 నుంచి రూ.800 వరకు, కనకాంబరాలు కిలోకి రూ.2వేల నుంచి రూ.2,500 వరకు, గులాబీ కిలో రూ. 250 నుంచి రూ.400 వరకు ధర పలుకుతున్నాయి. ధరలు విపరీతంగా పెరగడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు.