
ఆటో లాక్కెళ్లారని మనస్తాపం
మొయినాబాద్: కిస్తులు (ఈఎంఐ) చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ వారు ఆటో లాక్కెళ్లారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నక్కలపల్లిలో గురువారం వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన అనిమోని బాలకిష్టయ్య దంపతులకు పిల్లలు లేకపోవడంతో చిన్నతనంలోనే శ్రీకాంత్(26)ను దత్తత తీసుకు న్నారు. కొంతకాలానికి బాలకిష్టయ్య దంపతులు చనిపోయారు. దీంతో ఆయన మేనఅల్లుడు, నక్కలపల్లికి చెందిన బంటు కృష్ణ.. శ్రీకాంత్ బాగోగులు చూస్తున్నాడు. కృష్ణకు చెందిన పాత ఇంట్లో ఒంటరిగా ఉంటున్న శ్రీకాంత్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో కిస్తు లు కట్టకపోవడంతో ఐదురోజుల క్రితం ఫైనాన్స్ సంస్థ వారు వాహనాన్ని తీసుకెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన అతను ఇంట్లోని దూలానికి టవల్‌తో ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో కృష్ణ వెళ్లి చూశారు. శ్రీకాంత్ ఉరేసుకుని వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో కనిపించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆటో తీసుకెళ్లిన రోజే ఉరేసుకుని ఉంటాడని స్థానికులు పేర్కొన్నారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
నక్కలపల్లిలో విషాదం