
నక్షబాటను కబ్జాచేసి ఏర్పాట్లు చేసిన ప్రీకాస్ట్ వాల్
ముర్తుజగూడలో మూడు ఎకరాలు కబ్జా
111 జీఓ పరిధిలో అనధికారిక వెంచర్లు
యథేచ్ఛగా ప్లాట్ల అమ్మకాలు
నక్షాభూమిని కబ్జా చేయడంతో వెలుగులోకి..
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితుడు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అది పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉన్న భూమి. డీటీసీపీ, హెచ్‌ఎండీఏలు సైతం వెంచర్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయవు. కానీ కొంత మంది రియల్టర్లు ఏకంగా అనధికార వెంచర్ చేశారు. గుంటల్లో ఉన్న వ్యవసాయ భూమిని గజాల్లోకి మార్చి గుట్టుగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. ఇంతటితో ఆగకుండా నక్షబాటను కబ్జా చేసి పక్కనే ఉన్న పట్టా భూముల్లో కలిపేశారు. చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి సరిహద్దు భూముల్లోకి ఇతరుల రాకపోకలను నిలిపివేశారు.
కబ్జాకు గురైన నక్షబాటకు విముక్తి కల్పించాలని కోరుతూ ఓ బాధితుడు ఇటీవల కలెక్టర్‌కు విన్నవించారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి, నక్షబాట ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారించినప్పటికీ.. దారి వదిలేందుకు రియల్టర్లు మాత్రం అంగీకరించడం లేదు. విధిలేని పరిస్థితుల్లో సదరు బాధితుడు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
అనధికారిక వెంచర్.. అడ్డగోలు అమ్మకాలు
2018లో మెయినాబాద్ మండలం ముర్తుజగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 251, 252(ఓల్డ్ సర్వే నంబర్లు 88,146)లోని 11.24 ఎకరాల్లో కొంతమంది రియల్టర్లు 165 ప్లాట్లతో అనధికారిక వెంచర్ చేశారు. పద్మావతి కాలనీగా నామకరణం చేశారు. గుంటల్లో ఉన్న భూమిని గజాల్లోకి మార్చి, గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ క్రమంలో భూములకు ఆనుకుని ఉన్న 253 సర్వే నంబర్‌లోని నక్షబాటను సైతం కబ్జాచేసి పద్మావతి కాలనీలో కలిపేశారు. 111 జీఓ పరిధిలో వెంచర్ చేయడంతో పాటు 120 నుంచి 350 గజాల చొప్పున ప్లాట్లు చేసి విక్రయించారు. ఆ వెంచర్ నుంచి పై భాగంలో ఉన్న వ్యవసాయ భూముల్లోకి వెళ్లే వారికి దారి లేకుండా చేసి రాకపోకలను నిషేధించారు.
ప్రజావసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాలను(1,866 గజాలతో ఒకటి, 216 గజాలతో మరొక పార్కును) ముర్తుజగూడ గ్రామ పంచాయతీ పేరున గిఫ్ట్ డీడ్ చేయడం కొసమెరుపు. నాలా కన్వర్షన్ కూడా కానీ ఈ భూములను రిజిస్ట్రేషేన్లు ఎలా చేస్తున్నారో అంతు చిక్కడం ప్రశ్న. వాస్తవ విస్తీర్ణానికి మించి వెంచర్‌లో భూములున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పక్క సర్వే నంబర్లలో ఉన్న మూడు ఎకరాల ఇనాం భూములను ఈ అనధికారిక వెంచర్‌లోనే కలిపేసినట్లు సమాచారం. స్థానికంగా రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు రియల్టర్లతో కుమ్మకై ్క.. కళ్లముందే అక్రమంగా వెలుస్తున్న వెంచర్లను చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రియల్టర్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.
అవన్నీ అక్రమ వెంచర్లే..
అనధికారిక వెంచర్‌లో నక్షబాట ఉన్నట్లు గుర్తించాం. మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి ఇతర రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా ఏర్పాటు చేసిన ప్రహరీ తొలగిస్తాం. 111 జీఓ పరిధిలోని వెంచర్లకు ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. జీఓ పరిధిలో ఉన్న వెంచర్లన్నీ..అక్రమమైనవే. – గౌతంకుమార్, తహసీల్దార్, మొయినాబాద్
దారి చూపండి
ముర్తుజగూడ సర్వే నంబర్ 254లో 1.16 ఎకరాల పట్టా భూమి ఉంది. సరిహద్దులోని సర్వే నంబర్లు 251, 252లో నక్షబాట ఉండేది. పట్టా దారులు ఆ నక్షబాటను కబ్జా చేశారు. రెండు సర్వే నంబర్లలోని మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించి అనధికారిక వెంచర్ చేశారు. వెంచర్ చుట్టూ ప్రీకాస్ట్ వాల్స్‌ను ఏర్పాటు చేశారు. నక్షబాటను కబ్జా చేసి ప్లాట్లు చేయడంతో పాటు ఇతర రైతులు తమ భూముల్లోకి వెళ్లకుండా దారి మూసివేశారు. అధికారులు వెంటనే స్పందించి నక్షబాటను పునరుద్ధరించాలి. – ఆర్.మల్లికార్జున్, బండ్లగూడ