
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
చేవెళ్ల: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కె.హన్మంత్‌రావు అన్నారు. మండలంలోని పలు పాఠశాలల్లో బుధవారం సంఘం నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్త్‌కార్డులు వెంటనే అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, కామన్ సర్వీస్ రూల్స్ అమలుకు ప్రయత్నం చేయాలని, కేజీబీవీ, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, నూతన పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల సాధనకోసం టీపీయూఎస్ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు, గౌరవ అధ్యక్షుడు గణపురం సురధీర్, మండల కోశాధికారి దూత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.