
దొరకని ఆచూకీ
● నాగార్జునసాగర్ అందాలు చూడ్డానికి వెళ్లి..
● ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన యువకుడు
● గల్లంతై మూడు రోజులైనా లభించని జాడ
మంచాల: నాగార్జునసాగర్ అందాలు చూడడానికి స్నేహితులతో కలిసి వెళ్లిన యువకుడి ఆచూకీ మూడు రోజులైనా దొరకలేదు. మండలంలోని జాపాల గ్రామానికి చెందిన మంతని శివ (24), సోప్పరి శివ, కాగజ్‌ఘట్ గ్రామానికి చెందిన దూసరి గణేశ్, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన పండుగ నర్సింహ స్నేహితులు. సోమవారం సాయంత్రం సరదాగా చూసొద్దామని నాగార్జునసాగర్ వెళ్లారు. కొద్ది సేపు బ్రిడ్జిపై కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు. అంతలోనే శివ బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజులైనా జాడ కనిపించలేదు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో తల్లిదండ్రులు గారాబంగా పెంచారు. ఆచూకీ దొరకకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.