
చోరీ కేసులో దంపతుల అరెస్టు
ఆమనగల్లు: వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణాన్ని అపహరించిన ఓ జంటని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు తలకొండపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామ సమీపంలో గత నెల 30న సాయిబాబ గుడి దగ్గర బెంచిపై అదే గ్రామానికి చెందిన వృద్ధురాలు మల్లమ్మ కూర్చుని ఉంది. ఇద్దరు ఆమె వద్దకు వచ్చి మాటలు కలిపారు. ఈ క్రమంలో మెడలో ఉన్న బంగారు గుండ్లహారం తీసుకొని నకిలీ ఆభరణం తిరిగి ఇచ్చారు. ఇంటికి వెళ్లిన వృద్ధురాలు అనుమానంతో తన మనవడికి చూపించగా ఆభరణం నకిలీదని గుర్తించి వెంటనే తలకొండపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి వెల్జాలలో ఆభరణం దొంగిలించి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో బంగారు షాపులో వాటిని విక్రయించినట్లు గుర్తించారు. అనంతరం నిందితులను శంషాబాద్ సీసీఎస్ పోలీసుల సహాయంతో జడ్చర్లలో నవాబ్‌పేట మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలైన ఎరుకలి శ్రీను, అరుణలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ వివరించారు. కేసును త్వరితగతిన ఛేదించిన క్రైం కానిస్టేబుల్ జాషువాను అభినందించారు.