డాక్టర్‌ నమ్రతపై మరో కేసు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ నమ్రతపై మరో కేసు

Aug 7 2025 10:36 AM | Updated on Aug 7 2025 10:36 AM

డాక్టర్‌ నమ్రతపై మరో కేసు

డాక్టర్‌ నమ్రతపై మరో కేసు

సాక్షి,సిటీబ్యూరో/రామ్‌గోపాల్‌పేట: సరోగసి పేరు తో శిశువుల అక్రమ రవాణాకు పాల్పడిన యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ నిర్వాహకురాలు డాక్టర్‌ నమ్రతపై బుధవారం మరో కేసు నమోదైంది. సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని రిజిస్టర్‌ చేసిన గోపాలపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో కలిపి ఇప్పటి వరకు నమ్రత, ఆమె ముఠాపై నమోదైన కేసుల సంఖ్య ఆరుకు చేరింది. తాజాగా ఈ కేసులో మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. వీరితో కలిపి ఇప్పటి వరకు అరెస్టు అయిన వారి సంఖ్య 22కు చేరింది. నమ్రతపై 2020లో విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి. వీటి ప్రభావంతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ లైసెన్సులు అధికారులు పొడిగించలేదు. ఆ సమయంలో తాను ఆస్పత్రి మూసేస్తున్నట్లు సమాచారం ఇచ్చిన నమ్రత అక్రమంగా కొనసాగించారు. తన పేరు బయటకు రాకుండా ఉండటానికి చికిత్స కోసం సంప్రదించిన వారికి మరో డాక్టర్‌ పేరుతో ఉన్న లెటర్‌ హెడ్‌పై మందులు, పరీక్షల వివరాలు రాసి ఇచ్చారు. రాజస్థాన్‌ దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు సృష్టి సెంటర్‌పై దాడి చేసినప్పుడు ఈ లెటర్‌హెడ్స్‌ పోలీసులకు లభించలేదు. అయితే వరుసగా ఠాణా మెట్లు ఎక్కుతున్న బాధితుల్లో కొందరు తమ ఫిర్యాదులతో పాటు నమ్రత రాసి ఇచ్చిన మందుల చీటీలు తదితరాలను జత చేశారు. వీటిలో కొన్ని సదరు డాక్టర్‌ పేరుతో ఉండటాన్ని గమనించిన పోలీసులు దీనిపై ఆరా తీశారు. సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్‌ అయిన ఆమె ఓ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. పోలీసులు ఆమెను సంప్రదించినప్పుడే తన పేరుతో ఉన్న లెటర్‌ హెడ్స్‌ దుర్వినియోగం అవుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆమె స్వయంగా గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమ్రతపై బుధవారం మరో కేసు నమోదైంది. రాజస్థాన్‌ దంపతుల ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసులు నమ్రత ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఇది మంగళవారంతో పూర్తి అయింది. తాజాగా మరో కేసులో కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ బుధవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోపక్క సహ నిందితులుగా ఉన్న సంతోషి, కళ్యాణిల పోలీసు కస్టడీ పూర్తి కావడంతో కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

86 మందికి సరోగసి

ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వివరాలు, దర్యాప్తు, ఫిర్యాదుల ఆధారంగా నమ్రత తనకు ఉన్న వివిధ సెంటర్ల ద్వారా 86 మంది దంపతులకు సరోగసి చేసినట్లు గుర్తించారు. వీటిలో సక్రమం ఎన్ని? అక్రమం ఎన్ని? చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ఎన్ని? అనే అంశాలు ఆరా తీస్తున్నారు. దీనికోసం ఆ ప్రక్రియలు చేయించుకున్న దంపతుల కోసం గాలిస్తున్నారు. రాజస్థాన్‌ దంపతులతో పాటు మరో మూడు జంటలకు శిశువుల్ని విక్రయించినట్లు బయటపడింది. దీంతో ఈ శిశువులను రెస్క్యూ చేసిన పోలీసులు శిశువిహార్‌కు తరలించారు. ఈ వ్యవహారాల్లో దళారులుగా వ్యవహరించిన వారితో పాటు శిశువుల్ని ఉద్దేశపూర్వకంగా విక్రయించిన ముగ్గురు తల్లుల్ని కటకటాల్లోకి పంపారు. బుధవారం గోపాలపురం పోలీసులు నమ్రతతో సంబంధాలు కలిగి ఉండి, శిశు విక్రయాల దందా నడిపిన విశాఖపట్నం వైద్యులు రవి, రమ్యలతో పాటు ఏజెంట్లు విజయ్‌, సరోజ, రత్న, శిశువుల్ని విక్రయించిన ముగ్గురు తల్లుల్ని అరెస్టు చేశారు. ఈ ఎనిమిది మంది అరెస్టులతో కలిపి ఇప్పటి వరకు ‘సృష్టి’ సంబంధిత కేసుల్లో కటకటాల్లోకి చేరిన వారి సంఖ్య 22కు పెరిగింది.

ఫిర్యాదు చేసిన నగరానికి చెందిన గైనకాలజిస్ట్‌

తాజాగా మరో ఎనిమిది మంది నిందితుల అరెస్టు

లోతుగా దర్యాప్తు చేస్తున్న గోపాలపురం పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement