
విధుల్లో ఉన్న కండక్టర్ గుండెపోటుతో మృతి
అబ్దుల్లాపూర్‌మెట్: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కండక్టర్‌కు గుండెపోటు రావడంతో మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిఽధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన నిమ్మల బాలరాజ్‌గౌడ్ (54) హయత్‌నగర్– 2 డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం మధ్యాహ్నం విధుల్లో చేరిన బాల్‌రాజ్ రాత్రి 8.45గంటల సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి బస్‌లో వచ్చాడు. రాత్రి బస్సును కాలనీలో పార్క్ చేసి(నైట్ హాల్ట్), బ్లాక్ నం.62/1లో విశ్రాంతి తీసుకుంటుండగా రాత్రి 11.20 గంటలకు ఛాతిలో నొప్పి వస్తోందని డ్రైవర్ ఉపేందర్‌కు చెప్పాడు. దీంతో ఆయన 108కు సమాచారం ఇవ్వగా అతన్ని పరీక్షించిన సిబ్బంది అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతి మాట్లాడటం లేదని..
సుభాష్‌నగర్: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతి గత కొన్ని రోజులుగా మాట్లాడకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరివేసుకుని చనిపోయిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన సందీప్ (20) రాజీవ్ గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. సందీప్‌కు విజయవాడకు చెందిన ఓ యువతి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయమైంది. తరచూ చాటింగ్ చేసుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుండి సదరు యువతి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మనస్తాపానికి గురైన సందీప్ మంగళవారం రాత్రి ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.