
టీసీ ఇచ్చి.. ఇంటికి పంపి!
కేశంపేట: ప్రవర్తన సరిగా లేదనే కారణంతో ఓ పదో తరగతి విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించారు. విద్యా సంవత్సరం మధ్యలో హాస్టల్ నుంచి పంపిస్తే తన కొడుకు చదువు పాడవుతుందని తండ్రి ఎంత వేడుకున్నా ప్రిన్సిపాల్ కనికరించలేదని బాధితుడు వాపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. చింతగట్టుతండాకు చెందిన పదో తరగతి విద్యార్థి సబావట్ రాహుల్ ఐదో తరగతి నుంచి కేశంపేట జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ఇటీవల అతని ప్రవర్తన బాగోలేదంటూ ప్రిన్సిపాల్ ప్రీతి బుధవారం విద్యార్థి తండ్రి రాజును హాస్టల్‌కు పిలిపించారు. మీ కొడుకు వ్యవహారం రోజురోజుకూ శ్రుతిమించుతోందని, అతన్ని భరించలేమని చెప్పారు. విద్యార్థి తండ్రి ఎంతగా వేడుకున్నా ప్రిన్సిపాల్ ససేమిరా అన్నారు. టీసీ తీసుకోకుండా వెళ్లేది లేదంటూ తలుపులు మూసి, తాళం వేశారు. దీంతో రాజు 100కు డయల్ చేసి తనను హాస్టల్‌లో బంధించారని ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ విద్యార్థితో పాటు అతని తండ్రితో సంతకాలు చేయించుకుని టీసీ చేతిలో పెట్టారు. ఇదిలా ఉండగా టీసీలో రాహుల్ ప్రవర్తన బాగుందని రాయడం గమనార్హం
విద్యార్థి ప్రవర్తన బాగో లేదంటూ ప్రిన్సిపాల్ నిర్ణయం
కేశంపేట జ్యోతిబాపూలే
గురుకులంలో ఘటన