
చిన్నారుల ఆరోగ్యానికి చర్యలు
షాద్‌నగర్: చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని కమ్యూనిటీ ఆస్పత్రి ఆవరణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల హెచ్‌ఎంలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు నులి పురుగుల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని ఈనెల 11న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నులి పురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను సరఫరా చేస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ మాత్రలను పంపిణీ చేసి చిన్నారులతో మింగించాలని సూచించారు. ఒకటి నుంచి రెండేళ్ల వయసుఉన్న పిల్లలకు సగం మాత్రను నీటిలో కలిపి వేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాల్లో నివసించడం, చేతులు సరిగా కడుక్కోకపోవడం ద్వారా నులి పురుగులు సంక్రమించే అవకాశం ఉందన్నారు. సమావేశంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, వైద్యులు స్రవంతి, రాఘవేందర్, ఎంపీహెచ్‌ఈఓ శ్రావణ్‌కుమార్, హెల్త్ సూపర్‌వైజర్లు శ్రీరామ, అమృత, హెల్త్ అసిస్టెంట్ రెడ్యానాయక్, లింగం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి