
గుడిమల్కాపూర్@అజీజ్‌నగర్!
సమీకృత మార్కెట్‌ను తరలించే యోచన
మొయినాబాద్: మెహిదీపట్నం సమీపంలో ఉన్న గుడిమల్కాపూర్‌లో 1992లో అప్పటి అవసరాలకు అనుగుణంగా కూరగాయలు, పూల మార్కెట్ నిర్మించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల మార్కెట్, 11 ఎకరాల విస్తీర్ణంలో పూలమార్కెట్ కొనసాగుతున్నాయి. నిత్యం వేల మంది రైతులు కూరగాయలు, పూలు తీసుకుని మార్కెట్‌కు వెళ్తున్నారు. ప్రతిరోజు 20–25 టన్నుల కూరగాయలు, 30–40 టన్నుల పూలు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి.
ట్రాఫిక్ తిప్పలు తప్పేలా..
రైతులతోపాటు, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే కూరగాయలు, పూలను లారీలు, డీసీఎంలలో తీసుకొస్తుంటారు. కొనడానికి వచ్చేవారు సైతం వాహనాలను తెస్తుంటారు. మార్కెట్ స్థాయికి మించి వాహనాలు వస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ జాం అవుతోంది. పండుగల సమయంలో సమస్య మరింత జఠిలంగా మారి గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుంటాయి. దూర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు వచ్చే రైతులు ట్రాఫిక్ సమస్యతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు మార్కెట్‌లో దళారులు ఎక్కువై రైతులు నష్టపోతున్నారు. మార్కెట్‌లో మౌలిక సదుపాయాలు సైతం కరువయ్యాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మార్కెట్‌ను నగర శివారుకు తరలించే ప్రక్రియను మొదలు పెట్టారు.
ఓఆర్‌ఆర్ పక్కనే స్థల పరిశీలన
ఔటర్ రింగ్‌రోడ్డు పక్కనే అజీజ్‌నగర్ రెవెన్యూలోని సర్వేనంబర్ 176లో 150 ఎకరాలను మార్కెట్ ఏర్పాటుకు పరిశీలించారు. ఓఆర్‌ఆర్ సమీపంలో మార్కెట్ ఏర్పాటు చేస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి, స్థానిక రైతులకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల రైతులకు సైతం అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు 150 ఎకరాల భూమిని సర్వే చేసి కలెక్టర్‌కు నివేదిక పంపారు. మార్కెట్ తరలింపునకు సంబంధించిన ప్రతిపాదనలను గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీతోపాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రభుత్వానికి పంపారు. భూ కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే స్థల సేకరణ చేపట్టి పనులు మొదలు పెట్టనున్నారు.
రైతుల సౌలభ్యం కోసం
గుడిమల్కాపూర్‌లో స్థలం సరిపోక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌ను ఓఆర్‌ఆర్ సమీపంలోకి తరలించాల ని ప్రతిపాదించాం. రైతుల సౌలభ్యంకోసం, మెరుగైన వసతులు కల్పించేందుకు మార్కెట్ కమిటీలో చర్చించి 150 ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటుకోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. – కావలి చంద్రశేఖర్,
గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్
ఓఆర్‌ఆర్ పక్కనే అజీజ్‌నగర్ రెవెన్యూలో భూ పరిశీలన
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన అధికారులు
మార్కెట్ ఏర్పాటైతే రైతులకు సౌలభ్యం
ఇబ్బందులు తీరతాయి
గుడిమల్కాపూర్ మార్కెట్‌లో ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఉన్నాయి. మార్కెట్‌లో వాహనాల పార్కింగ్‌కు స్థలం లేదు. ట్రాఫిక్ జామ్‌తో తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. మార్కెట్‌ను అజీజ్‌నగర్‌కు తరలిస్తే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
– గడ్డం వెంకట్‌రెడ్డి, సురంగల్, మొయినాబాద్

గుడిమల్కాపూర్@అజీజ్‌నగర్!

గుడిమల్కాపూర్@అజీజ్‌నగర్!