
ఆహార విక్రయంలో ప్రమాణాలు పాటించాలి
షాద్‌నగర్‌రూరల్: వీధి ఆహార విక్రేతలు పరిశుభ్రతను పాటించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని నెస్ట్‌లే ఇండియా కార్పొరేట్ అఫైర్స్ మేనేజర్ ఎం.డి.వసీం అన్నారు. పట్టణంలోని పద్మశాలి సంఘం భవనంలో మంగళవారం నేషనల్ అసోసియేషన్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా, నెస్‌లే ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో వీధి ఆహార విక్రేతలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వసీం మాట్లాడుతూ.. వీధి ఆహార విక్రేతలు ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. ఆహార నిల్వ, ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. 26 ఏళ్లుగా వీధి ఆహార విక్రేతల హక్కులకోసం పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1,700 మంది వీధి ఆహార విక్రేతలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నేషనల్ అసోసియేషన్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు రంగాశాలివాహన్ మాట్లాడుతూ.. నాణ్యాతా ప్రమాణాలు పాటిస్తే వినియోగదారుల్లో వీధి ఆహారంపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రమాణాల ప్రకారం శిక్షణ తీసుకున్న వీధి ఆహార విక్రేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ విజయ్‌కుమార్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఖలీల్, సాయి తదితరులు పాల్గొన్నారు.