
మహాసభలను జయప్రదం చేయాలి
తుర్కయంజాల్: సెప్టెంబర్ 19, 20 తేదీల్లో తుర్కయంజాల్‌లో నిర్వహించనున్న మున్సిపల్ కార్మికుల రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయా లని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ కోరారు. రాగన్నగూడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించడం లేదని, పని భద్రత లేదని, ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నా పర్మినెంట్‌కు నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వం 2వ పీఆర్‌సీలో కనీస వేతనం రూ.26వేలు ఇవ్వడంతో పాటు, 60 ఏళ్లు పైబడిన, మరణించిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులకు పనికల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, ప్రమాద బీమా కల్పించాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె సెగ తప్పదని హెచ్చరించారు. అనంతరం ఆహ్వాన సంఘం చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.కిషన్, కోశాధికారిగా సీహెచ్ ఎల్లయ్య, పాలడుగు భాస్కర్, ఎం.చంద్రమోహన్‌తో పాటు పలువురిని ఎన్నుకున్నారు. సమావేశంలో 14 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల నుంచి కార్మికులు పాల్గొన్నారు.