
మొయినాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని మృగవని పార్కు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. నార్సింగి మున్సిపాలిటీకి చెందిన సిద్ధార్థ (27) మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తన కారులో నార్సింగి నుంచి మొయినాబాద్ వైపు వెళ్తున్నాడు. మృగవని జాతీయ పార్కు వద్ద వెనకనుంచి అతివేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన సిద్ధార్థ కారు డివైడర్ పైనుంచి అవతలివైపునకు దూసుకెళ్లింది. ఈ సమయంలో మొయినాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న సిద్ధార్థ అక్కడికక్కడే చనిపోయాడు. కారు బెలూన్లు తెరుచుకున్నప్పటికీ అతని ప్రాణాలు దక్కలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, లారీ కింది భాగంలోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు. కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కావడంతో సిద్ధార్థ అప్పటికే మృతిచెందాడు. సినిమా స్టంట్స్ తరహాలో జరిగిన ప్రమాదం కారణంగా అజీజ్‌నగర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదిలా ఉండగా సిద్ధార్థ కారును ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
సినిమా స్టంట్స్ తరహాలో ఘటన
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అక్కడికక్కడే దుర్మరణం