
డ్రగ్స్‌కు బానిసలు కావొద్దు
ఇబ్రహీంపట్నం: విద్యార్థులు, యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించాలని, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను నిషేధించాలని ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయికు బానిసై జ్ఞానాన్ని, విచక్షణను, శక్తిసామర్థ్యాలను కోల్పోయి జీవితాలను నిస్తేజంగా మార్చుకుంటున్నారని పేర్కొన్నారు. చదువులు, ఉద్యోగాలకు దూరమై కుటుంబాలకు భారమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను పెడదారి పట్టిస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వం ఈ మహమ్మారిని ప్రారద్రోలేందుకు కలిసికట్టుగా పోరు సాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పి.జగన్, జిల్లా ఉపాధ్యక్షుడు అలంపల్లి జంగయ్య, నాయకులు పి.శివశంకర్, ఆర్.స్వామి, రాఘవేందర్, శివ, చైతన్య, మహేశ్, ప్రభాకర్, లెనిన్, వినోద్, యాదగిరి పాల్గొన్నారు.