
డిగ్రీ విద్యార్థి అదృశ్యం
శంకర్‌పల్లి: డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హనుమాన్‌నగర్ కాలనీకి చెందిన వసంత్‌కుమార్(18) డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. గత నెల 29న ఇంట్లో ఎవరికి చెప్పకుండా, బయటకు వెళ్లి, తిరిగిరాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా సమాచారం లభించలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు
దుద్యాల్: బైక్ అదుపుతప్పడంతో ఓ ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఆలేడ్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని కుదురుమల్లకు చెందిన శివగల్ల కృష్ణ దుద్యాల్ గేట్ నుంచి కుదురుమల్లకు తన బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో బైక్ అదుపుతప్పడంతో కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన గ్రామస్తులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
వైద్య శిబిరానికి స్పందన
380 మందికి ఉచిత పరీక్షలు
తాండూరు టౌన్: పట్టణంలోని ఇందిరానగర్ అర్బన్ పీహెచ్‌సీలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 380 మంది పేషంట్లు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈసందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. డీఎంహెచ్‌ఓ లలితాదేవి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ఈ శిబిరం విజయవంతమైంది అన్నారు. 62 మందికి ఆపరేషన్ల నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. వీరికి వారం రోజుల్లో ఆపరేషన్లు పూర్తి చేస్తామన్నారు. అనంతరం పేషెంట్లకు ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు గిరిధర్, అక్షయ్, అఖీల్ ఖాన్, రాధ, రాజేశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

డిగ్రీ విద్యార్థి అదృశ్యం